అనంతపురం ప్రతినిధి : మహిళ ఎందులోనూ తక్కువ కాదు... పురుషులతో సమానమే అంటూ వళ్లేవేసి మాటలు చేతల్లో కనిపించడం లేదు. ఆమెపై అణిచివేత, అఘాయత్యాలు ఆగడం లేదు. ఒంటరిగా బయటకే కాదు... కుటుంబంలోనూ సురక్షితంగా ఉండలేని దయనీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అఘాయిత్యానికి గురైన వారికి అందుతున్న సహకారం, సహాయమూ ప్రభుత్వం వైపు నుంచి నామమాత్రమనే చెప్పాలి. ఇదోరకమైన వివక్ష ప్రభుత్వం వైపు నుంచి ఎదురవుతోంది.
మహిళపై పెరుగుతున్న హింస
మహిళలపై రోజురోజుకు హింస పెరుగుతూనే ఉంది. 2021, 2022 సంవత్సరాల్లో చోటు చేసుకున్న నేర గణాంకాలే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తాయి. 2021 సంవత్సరలో అనంతపురం జిల్లా పరిదిలో రెండు వరకట్న వేధింపు హత్యలు జరిగితే 2022లో అవి ఆరుకు పెరిగాయి. 2021 సంవత్సరంలో జిల్లాలో జరిగిన మొత్తం కిడ్నాపులు 40 అయితే అందులో 32 మంది మహిళలే కిడ్నాప్ గురైయ్యారు. 2022లో మొత్తం 31 జరిగితే అందులో 28 మంది మహిళలు ఉన్నారు. వరకట్న వేధింపు కేసులు 2021లో 209 జరిగితే, 2022 సంవత్సరంలో 248 నమోదయ్యాయి. ఫోక్సో చట్టం కింద 89 కేసులు నమోదయ్యాయి. ఇలా మహిళలపై అఘాయిత్యాలు అధికంగా ఉంటున్నాయి.
బాధితులకు న్యాయం ఏది. ?
మహిళపై అఘాయిత్యం జరిగితే మూడు వారాల్లోపు శిక్ష పడే విధంగా పాస్టుట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి 2019లోనే ప్రకటించారు. ఈ మేరకు దిశ చట్టాన్ని తీసుకొచ్చారు. కాని ఇవి ఇంతవరకు కార్యరూపం దాల్చలేదనే చెప్పాలి. ఇందుకు జిల్లాలో ధర్మవరం ప్రాంతంలో జరిగిన యువతి అత్యాచారమే ఉదాహరణగా చెప్పవచ్చు. అప్పట్లో ఈఘటన రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున చర్చనీయాంశం అయ్యింది. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆందోళనలను సద్దుమనిచేందుకు ప్రభుత్వం తక్షణం బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగాన్ని ఇచ్చారు. అయితే ఈ కేసు 2020 డిసెంబరు 24న నమోదు అయ్యింది. ఇప్పటికి రెండేళ్లు పూర్తయినా నిందితులకు ఇంకా శిక్ష పడలేదు. ఈ ఏడాది జనవరిలో ఈ కేసు హియరింగ్‌కు వచ్చింది. ఇది పూర్తయి శిక్ష ఖరారయ్యేందుకు ఇంకెంత సమయం పడుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే సమయంలో కొద్ది రోజుల వ్యవధిలో కళ్యాణదుర్గం ప్రాంతంలోనూ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసులోనూ నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదు.
కొందిమందికే పరిహారం
పోక్సో చట్టం కింద బాలికలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు వారికి ఆర్థిక తోడ్పాటును అందించి న్యాయం కోసం పోరాడేందుకు సహకారం అందించేందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంది. డిస్ట్రిక్ లీగల్ సెల్ అథారిటీ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ బాధ్యతలు నిర్వర్తించాలి. కేసు నమోదయిన సమయంలో బాలికపై జరిగిన అఘాత్య తీవ్రతను బట్టి పరిహారాన్ని రూ.1.50 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు పరిహారమివ్వాలని ఉంది. ఇందులో ప్రాథమికంగా 25 శాతమైనా బాధితురాలి కుటుంబానికి అందజేయాలని చట్టం చెబుతోంది. కాని ఉమ్మడి జిల్లాలో చూసినప్పుడు మొత్తం 98 పోక్సో చట్టం కింద కేసులు నమోదై ఉన్నాయి. ఇందులో ఐదారు కేసుల్లో మాత్రమే పరిహారం అందింది. తక్కిన కేసుల్లో ఏ మాత్రం పరిహారం అందని పరిస్థితి ఉంది. 2018 నుంచి ఇప్పటి వరకు అదే పరిస్థితి కొనసాగుతూపోతోంది.
బాధితులకు అండగా నిలవాలి
భానుజ, రెడ్స్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి.
సమాజంలో మహిళలపై హింస రోజురోజుకూ పెరుగుతూపోతోంది. ఇటువంటి సమయాల్లో వాటిని ఎదుర్కొని నిలబడే విధంగా బాధితులుగానున్న వారికి త్పోడాటు అండనివ్వాల్సిన అవసరముంది. ఆ రకంగా ఉండేందుకు వీలుగా ప్రత్యేకమైన వ్యస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాని దురదృష్టం ఆ వ్యవస్థలూ అంతగా బాధితులకు అండగా నిలబడటం లేదేమో అనిపిస్తోంది. పైగా ఇటువంటి వారిపట్ల సమాజంలోనూ ఒకరకమైన వివక్ష, చిన్నచూపు కొనసాగుతుండటం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు బాధితులకు అండగా ఉన్నామని భరోసా కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.










