Feb 07,2022 08:17

లతా మంగేష్కర్‌... అసలు పేరు హేమ. హేమ అంటే బంగారం. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆమె గానంలోనూ, వ్యక్తిత్వంలోనూ రాణించారు. 30కి పైగా దేశ విదేశ భాషల్లో, 27 వేల సినిమా గీతాలతో శ్రోతల మనసులను పరవశింపచేశారు. ఆమె పాటలు మన మనసును ఉత్తేజితం చేస్తే... ఆమె జీవనయానం మనలో స్ఫూర్తిని నింపుతుంది.
   లతా మంగేస్కర్‌ తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌ గాయకుడు, రంగస్థల నటుడు. తల్లి శేవంతీ మంగేష్కర్‌. తండ్రి రాసిన 'భవబంధన్‌' నాటకంలోని నాయకి పేరు లతిక. ఆ పాత్రను చూసిన లతాజీ తన పేరును లతా మంగేష్కర్‌గా మార్చుకున్నారు. తండ్రి నడిపే నాటకాల కంపెనీలో సంగీత ప్రధానమైన నాటకాల్లో లత నటించడమే కాక, పాటలూ పాడేవారు. కూతురిలోని గాయనిని మొదట గుర్తించింది ఆమె తండ్రే. ఐదో ఏట నుంచే ఆమె నటించడం మొదలు పెట్టారు. స్కూలికి వెళ్లి తోటి విద్యార్థినులకు పాటలు నేర్పేవారు. ఒకసారి టీచరు ఇలా అయితే, నువ్వు బడికి రావద్దని అన్నారు. దీంతో, లత బడికి వెళ్లడం మానేశారు. లతకు తండ్రి సంగీత సప్తస్వర జ్ఞానం అందిస్తే, హిందుస్థానీ సంగీత గురువులైన అమన్‌ అలీఖాన్‌, అమానత్‌ ఖాన్‌ల వద్ద ఆమె సంగీతం అభ్యసించి, గానకోకిలగా మారారు. 13 ఏళ్ల వయసులో అంటే 1942లో 'కిటి హస్సల్‌' అనే మరాఠీ చిత్రం కోసం మొదటిసారిగా రెండు పాటలు పాడారు. అయితే, ఆ చిత్రం విడుదల కాలేదు. ఈ చిత్రంలో ఆమె పాడిన 'నటాలీ చైత్రాచి నవలారు' లత తొలి మరాఠి పాటగా గ్రామ్‌ఫోన్‌ రికార్డుల్లోకి ఎక్కింది.
    1942లో ఆమె తండ్రి చనిపోయారు. దీంతో, ముగ్గురు చెల్లెళ్ల, ఒక తమ్ముడి పోషణ భారం లతా మోయాల్సి వచ్చింది. జీవిక కోసం 1948 వరకూ పాటలు పాడడంతో పాటు ఎనిమిది సినిమాల్లో నటించారు. ఆమె స్వరం పీలగా ఉందని సంగీత దర్శకులు తొలుత తిరస్కరించినా, 1949లో 'మహల్‌' సినిమాలో ఆమె పాడిన 'ఆయేగా ఆనేవాలా' పాటతో పాపులర్‌ అయింది. తరువాత సంగీత దర్శకులంతా ఆమె చుట్టూ తిరగడం మొదలైంది.
    1962లో చైనాతో యుద్ధం సందర్భంలో జవాన్లను ఉద్దేశించి లతాజీ పాడిన 'ఆయె మేరీ వతన్‌కి లోగొం' పాట అప్పటి ప్రధాని నెహ్రూని కదిలించింది. ఆ పాట విని కంట తడి పెట్టానని ఆయన స్వయంగా లతాజీతో చెప్పారు. 1942 నుంచి 2015 దాకా 73 ఏళ్లపాటు ఆమె అవిశ్రాంతంగా సినిమా పాటలు పాడారు. తనకు ఎంత వయసు వచ్చినా గొంతుకు మాత్రం నవయవ్వన మాధుర్యమే! 1990లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు ఆమెను వరించింది. ఎమ్మెస్‌ సుబ్బలక్ష్మి తరువాత భారతరత్న పురస్కారం అందుకొన్న రెండో గాయనీ ఆమె. లతకి ఇష్టమైన ఆట క్రికెట్‌. లార్డ్స్‌ స్టేడియంలో ఆమెకి ప్రత్యేకమైన, శాశ్వతమైన గ్యాలరీ ఉంది. లతా మంగేస్కర్‌ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖులు నివాళ్లు అర్పించారు. దేశం ఒక గొప్ప సంగీత శిఖరాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు.

 

                                                              ప్రముఖుల నివాళి

లతా మంగేష్కర్‌ భౌతిక కాయానికి ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. లతా పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి, నమస్కరించారు. లతా మంగేష్కర్‌ భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. అభిమానుల సందర్శనార్థం లతాజీ పార్థివదేహాన్ని ఆమె ఇంటి నుంచి ముంబయిలోని శివాజీ పార్కుకు తీసుకొచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, శరద్‌ పవార్‌ తదితరులు ఆమెకు నివాళులర్పించారు. ఆమె పార్థివ దేహంపై జాతీయ పతాకాన్ని కప్పి, సైనిక వందనం సమర్పించారు. సాయంత్రం 6.15 గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు.
 

                                                       రెండ్రోజులు సంతాప దినాలు

లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆది, సోమవారాలను సంతాప దినాలుగా పేర్కొంది. రెండ్రోజులు జాతీయ జెండా అవనతం చేయనున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు దినాన్ని ప్రకటించింది.
 

                                                  ఆమె లేని లోటు పూడ్చలేనిది : మోడీ

''లతా దీదీ మనల్ని విడిచి వెళ్లారు. నాలో బయటకు చెప్పలేని ఆవేదన. ఆమె లేని లోటు పూడ్చలేనిది. ఆమె స్వరంతో ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. రాబోయే తరాలు ఆమెను భారత సంస్కతికి ప్రతినిధిగా స్మరించుకుంటారు. ఆమె పాటలు అనేక రకాల వ్యక్తీకరణలను వెలుగులోకి తెచ్చాయి. దశాబ్దాలుగా భారత చలనచిత్ర రంగంలో వచ్చిన మార్పులకు ఆమె సాక్షిగా నిలిచారు. ఆమె ఎప్పుడూ భారతదేశ వృద్ధిని కాంక్షించేవారు. అభివృద్ధి చెందిన బలమైన భారతదేశాన్ని చూడాలని ఆమె ఆకాంక్షించారు. లతా దీదీ నుంచి నేను ఎప్పుడూ ఆప్యాయమైన పలకరింపును పొందానని చెప్పడానికి గౌరవంగా భావిస్తున్నాను. ఆమెతో జరిపిన సంభాషణలు మరువలేనివి. ఆమె మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి నా సానుభూతి వ్యక్తం చేశాను. ఓం శాంతి''

                                      శతాబ్దానికి ఇలాంటి వారు ఒక్కరు జన్మిస్తారు : రాష్ట్రపతి

''లతాజీ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది హృదయాలను కలిచివేసింది. ఆమె పాటల్లో భారతదేశ గొప్పతనం, తత్వం వ్యక్తమయ్యేది. భారతరత్న లతాజీ సాధించిన విజయాలు సాటిలేనివి. ఇలాంటి కళాకారులు శతాబ్దంలో ఒక్కరు జన్మిస్తారు. లతా దీదీ అసాధారణమైన మనిషి. నేను ఆమెను కలిసినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఓ దివ్య స్వరం శాశ్వతంగా నిశ్శబ్దంలోకి వెళ్లినా.. ఆమె శ్రావ్యమైన స్వరాలు మాత్రం నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఆమె కుటుంబ సభ్యులకు, ప్రపంచ నలుమూలలా ఉన్న ఆమె అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి''
                                                      - రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతి