బ్రస్సెల్ : ఒక వ్యక్తికి ఒకసారి ఒక వేరియంట్ మాత్రమే సోకుతుందని ఇప్పటివరకు అందరూ భావించారు. అయితే ఒకేసారి రెండు వేరియంట్లు కూడా దాడి చేసే అవకాశం ఉందని నిపుణులు తేల్చారు. అథ్యయనానికి సంబంధించిన వివరాలను యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్‌లో శనివారం ప్రచురించారు. బెల్జియంకు చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు కరోనా చికిత్స పొందుతూ మరణించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు షాక్ అయ్యారు. ఒకేసారి రెండు వేరియంట్లు సోకినట్లు తేలింది. ఆ మహిళ బ్రిటన్‌లో బయటపడిన ఆల్ఫా వేరియంట్, అలాగే దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన బీటా స్ట్రెయిన్‌లు రెండింటి బారిన పడినట్లు గుర్తించారు. ఈ రెండు వైరస్‌లు వేర్వేరు వ్యక్తుల నుండి ఆమెకు సోకినట్లు తెలిపారు. తరచూ కళ్లు తిరిగిపడిపోతుండటంతో మహిళను మార్చిలో బెల్జియన్ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం పరీక్షలో కరోనా సోకినట్లు నిర్థారణైంది. ఆ మహిళ ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు అవసరమైన అత్యవసర సేవలను అందించేందుకు ఒక వ్యక్తిని నియమించుకున్నారు. వ్యాక్సిన్ డోసులు కూడా తీసుకోలేదని అన్నారు. శ్వాస సమస్యలు తీవ్రమవడంతో.. ఐదు రోజుల అనంతరం మరణించింది. పరీక్షల నిమిత్తం వైద్యులు ఆమె ఊపిరితిత్తుల నుండి నమూనాలను సేకరించారు. ఈ నమూనాల్లో రెండు వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించేందుకు ఇదే కారణమా అన్న అంశాన్ని నిపుణులు వెల్లడించలేదు. గతంలోనూ ఇటువంటి కేసులు వెలుగులోకి వచ్చాయని వైద్యులు తెలిపారు. జనవరిలో బ్రెజిలియన్ శాస్త్రవేత్తకు కూడా రెండు వేరియంట్ల బారిన పడ్డారు. అయితే అప్పటి అధ్యయన వివరాలను జర్నల్‌లో ప్రచురించలేదని అన్నారు. పరిమిత సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం, జన్యువులతో సహా వైరస్‌ను గుర్తించే మార్గం లేకపోవడంతో ఇలా రెండు వేరియంట్ల బారిన పడుతున్న కేసులు వెలుగులోకి రావడం లేదని నిపుణుల్లో ఒకరైన వాంకీర్‌బర్గెన్ అన్నారు. వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండటం ముఖ్యమని ఆయన సూచించారు. ఇటువంటి సందర్భాల్లో వ్యాక్సిన్‌లు ఎంతవరకు రక్షణ కల్పించగలవన్న అనుమానాలు కలుగుతున్నాయి. పలుదేశాల్లో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ నుండి రక్షణ పొందేందుకు కొత్త ఔషదాలను, వ్యాక్సిన్‌లను రూపొందించేందుకు నిపుణులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. పలు దేశాలు తమ ప్రజలకు బూస్టర్‌డోసులను కూడా అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.










