Jan 04,2023 21:46

హిందూపురం పట్టణంలోని డిఎల్‌ రోడ్డు ఇదే....

      హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ అధికారులు ఆక్రమణల తొలగింపు పేరుతో రైల్వే రోడ్డు, ధనలక్ష్మి రోడ్డులో గృహాలతో పాటు పలు వాణిజ్య భవనాలను ఇటీవల తొలగించరు. ఆక్రమణల తొలగింపు జరిగిన వెంటనే పురపాలక సంఘం సాధరణ నిధులతో రోడ్డుతో పాటు మురుగు కాలవలు నిర్మాణం చేస్తామని చెప్పారు. ఇందులో భాగంగా గత నెల ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమాలను కూడా చేశారు. భూమిపూజ చేసి నెల రోజులు కావస్తున్నా ఈ రోడ్డు, మరుగుకాలువల పనులు నేటికీ ప్రారంభం అవలేదు. దీంతో స్థానికులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిందూపురం పురపాలక సంఘంలో ప్రధాన రహదారులతో పాటు పట్టణ అంతర్గత రహదారులను సైతం కొంత మంది కబ్జాదారులు కబ్జాలు చేసుకుని నిర్మాణలు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల కురిసిన వర్షాలకు మురుగు కాలువలు నిండి, మరుగు నీరు రోడ్డుపైకి రావాడంతో మున్సిపల్‌ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని కొన్ని ప్రాంతాల్లో ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారుల్లో ఉన్న ఆక్రమణలను తొలగించారు. పూర్తిస్థాయిలో నిధులు లేక పోయినా పురపాలక సంఘం ఆదాయాన్ని పెంచుతూ సాధరణ నిధులతో అత్యవసరం కింద ప్రధాన రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. రూ. 21లక్షలతో ధనలక్ష్మి రోడ్డు (డిఎల్‌ రోడ్డు) సిమెంట్‌ రోడ్డు పనులు, రూ.12.50లక్షలతో మురుగు కాలువ నిర్మాణ పనులను గత నెల ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ చేతుల మీదుగా భూమిపూజతో ప్రారంభించారు. ఈ పనులు భూమిపూజతోనే ఆగిపోయాయి. ఆక్రమణల తొలగించిన వ్యర్థాలు మురుగు కాలుల్లో పడడంతో మురుగునీరు ముందుకు సాగక రోడ్డుపై పారుతోంది. దీంతో ఇక్కడున్న స్థానికులు, ఈ మార్గంలో రాకపోకలు సాగించే వారు దుర్వాసన, దోమలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను తెలుపుదామంటే కమిషనర్‌ దీర్ఘకాలిక సెలవులో ఉండడంతో ఎవరికి చెప్పాలో తెలియక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్దిని పరుగులు తీయిస్తామంటున్న పాలకులు తమకు ఏమి తెలియనట్లు భూమిపూజతో వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పనులను పూర్తి చేస్తాం: డిఈఈ నీరజ
ధనలక్ష్మి రోడ్డులో ప్రారంభించిన సిమెంట్‌ రోడ్డు, మురుగు కాలువల నిర్మాణ పనులను సంబంధిత గుత్తేదారులతో చర్చించి, వెంటనే పనులు ప్రారంభిస్తాం. త్వరతగితిన పనులు పూర్తి అయ్యే విధంగా చూస్తాం. దీంతో పాటు రైల్వేరోడ్డు పనులు సైతం త్వరలో ప్రారంభిస్తాం.