Feb 21,2023 21:41

ఫొటో : శ్మశాన స్థలం వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు

ఆక్రమణలో రైస్‌మిల్‌కాలనీ శ్మశానం
- ఆందోళన వ్యక్తం చేస్తున్న బీరంగుంట గ్రామస్తులు
ప్రజాశక్తి-అల్లూరు : మండలంలోని బీరంగుంట పంచాయతీ రైస్‌మిల్‌కాలనీకి చెందిన ప్రజలు మంగళవారం శ్మశాన వాటిక వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఏకలవ్య ఎరుకుల, గిరిజన ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాసులు మాట్లాడుతూ 147 సర్వే నందు 1972లో అప్పటి ఎపి రెవెన్యూ శాఖ మంత్రి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి ఎస్‌టి, బిసిల శ్మశానం కోసం 0.45 సెంట్లు భూమిని కేటాయించినట్లు పేర్కొన్నారు. రోడ్డు మార్గాన శ్మశానం ఉండడంతో అందరికన్ను ఈ స్థలంపై పడిందని తెలియజేశారు. గతంలో పిడూరు రఘురామిరెడ్డి అల్లూరుకు చెందిన సుధీర్‌ ఈ స్థలాన్ని కబ్జా చేయగా అప్పటి తహశీల్దారు శ్రీరాములు ఆక్రమణలు తొలగించి హద్దులను ఏర్పాటు చేశారు.
ప్రస్తుత సర్పంచ్‌ భర్త మడపర్తి కామేశ్వరరావు ఈ స్థలంలో యథేచ్ఛగా ఇటుక బట్టీలు సాగు చేసుకుంటూ ఖాళీ చేయమంటే అడ్డం తిరుగుతున్నారని వివరించారు. ఎవరైనా గ్రామంలో చనిపోతే అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థలంలేక నానా అగచాట్లు పడుతున్నామన్నారు. గ్రామంలో 150 కుటుంబాలు ఉన్న నేపథ్యంలో వర్షాకాలంలో ఎవరైనా మరణిస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తపరిచారు. శ్మశాన స్థలాన్ని ఖాళీ చేయాలని గ్రామస్తులు విన్నవించినా పెడచెవిన పడుతూ కాలం గడుపుతూ వస్తున్నారని ఆరోపించారు. బాధితులు తమన్నత విషయంపై తహశీల్దార్‌ శ్రీరామకృష్ణకు వినతిపత్రాన్ని సమర్పించి వారి గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశాన స్థలాన్ని తగు పరిశీలించి విఆర్‌ఒ, సర్వేయర్లను పంపి న్యాయం చేస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో బీరంగుంట సచివాలయం కన్వీనర్‌ గరిక నరసింహారావు, పంట ఏడుకొండలు, తాత వెంకయ్య, నాశినం శేఖరయ్యా, దేవరకొండ రమేష్‌ తదితరులున్నారు.