ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రభుత్వ భూములు, మేత పోరంబోకు భూములను కబ్జా చేస్తున్న భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జి.చెర్లోపల్లి సర్పంచ్ మతకాల తిరుపతమ్మ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించి తహశీల్దార్ సానా శ్రీనివాసులురెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ జి.చెర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 250లో 3.50 ఎకరాలు, సర్వే నంబర్ 261లో 9 ఎకరాల 82 సెంట్లు పంచాయతీ పోరంబోకు భూమి ఉందని, ఈ భూమిని తమ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారన్నారు. ఈ సమస్యపై గతంలో అనేక దఫాలుగా తహశీల్దారుకు విన్నవించుకుంటున్న భూ ఆక్రమణదారులపై చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఈ భూమిపై తమ గ్రామానికి చెందిన పశువులు గొర్రెల కాపరులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఇకనైనా సంబంధిత రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుని గ్రామస్తులకు న్యాయంచేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు మతకాల శ్రీనివాసులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ విషయంపై తహశీల్దార్‌ను వివరణ కోరగా ఈ సర్వే నెంబర్లకు సంబంధించి 2001వ సంవత్సరంలో డి పట్టాలు ఇచ్చినట్లు లబ్ధిదారుల వద్ద డి పట్టాలు ఉన్నాయని, డి రిజిస్టర్‌లో కూడా నమోదై ఉన్నాయని, అయితే ఆన్‌లైన్‌లో మాత్రం నమోదు కాలేదన్నారు. ఈ సమస్యపై తమ కార్యాలయంలో ఉన్న అధికారుల క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.










