అక్రమంగా ప్రహరీ గోడల నిర్మాణం
ప్రజాశక్తి-కావలి : స్థానిక మన్నంగిదిన్నె గిరిజన కాలనీ, కావలి మాలపాలెం, ఇందిరమ్మ కాలనీలలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడల నిర్మాణాలని ''ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక'' బృందం ఆదివారం స్వయంగా పరిశీలించింది. స్థానిక ప్రజలతో మాట్లాడింది. తమ రియల్ ఎస్టేట్ వెంచర్ల పక్కన గిరిజన కాలనీ ఉంటే తమ ప్లాట్లు అమ్ముడుపోవని, గిరిజన కాలనీ, గిరిజనులు, దళితులు వారి ఇళ్లు కనపడకుండా సుమారు 15 అడుగుల ఎత్తు గోడలు నిర్మించడం అత్యంత అమానవీయమని వేదిక బృందం అభిప్రాయపడింది. ఇదిఒకరకంగా అంటరానితనాన్ని చూపించడమేనని, ఇలా భారీ ప్రహరీ గోడలు నిర్మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దళితులపై వేధింపుల కింద కేసు నమోదు చేయాలని వేదిక అభిప్రాయపడింది. వారి ప్రహరీ గోడలకు తమ ఇళ్లు అడ్డు వస్తున్నాయని ఇళ్లు ఖాళీ చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరిస్తున్నారని గిరిజన కాలనీ గిరిజనులు వేదిక బృందం ముందువాపోయారు. వర్షాలు వచ్చినప్పుడు తమ కాలనీ మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశానం కూడా మాయం చేసి, చెరువులో శ్మశానాన్ని కేటాయించారన్నారు. వర్షాలు వచ్చినప్పుడు, చెరువులో నీళ్లు ఉండటం వల్ల శవాలను పూడ్చలేక పోతున్నామని బృందం ముందు తెలియజేశారు. అలాగే ఇందిరమ్మ కాలనీ చుట్టూ భారీ ప్రహరీ గోడ నిర్మాణం వల్ల ప్రజలు పట్టణంలోకి రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని సుమారు మూడు కిలోమీటర్ల దూరం పెరుగుతుందని వేదిక బృందం అభిప్రాయ పడింది. ముసునూరులో ఉన్న స్కూలుకు విద్యార్థులు రావాలంటే కూడా దూరం పెరిగి ఇబ్బందులు పడతారని బందం అభిప్రాయపడింది. ఎన్నో సంవత్సరాలుగా తాము కావలి పట్టణంలోకి రావడానికి ఉపయోగిస్తున్న రోడ్డును భారీ ప్రహరీ గోడతో మూసివేయడం అన్యాయమని ప్రజలు ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక బృందంతో అన్నారు. తమకు దారి లేకుండాచేయడం అమానుషమని తెలిపారు. ఇలా కాలనీల చుట్టూ భారీ ప్రహరీ గోడలు నిర్మించడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎవరు అనుమతులు ఇచ్చారో అధికారులు తెలియజేయాలని డిమాండ్ చేశారు. నుడా అనుమతులు లేకుండానే భారీగా వెంచర్ల వేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారన్నారు. ఈ వెంచర్ల కోసం పెద్దపెద్ద మట్టి తిప్పల సైతం తొలిచి అక్రమంగా తమ వెంచర్లకు తరలించారని తెలిపారు. ఇవన్నీ అధికారులకు, కావలి ఎంఎల్‌ఎకు తెలుసు అని వారి ప్రోత్సాహంతోనే, వారి భాగస్వామ్యంతోనే జరుగుతున్నాయని వేదిక అభిప్రాయపడింది. రియల్ ఎస్టేట్ వెంచర్లే నుడా అనుమతులు లేకుండా అక్రమంగా వేస్తున్నారు. అక్రమంగా గ్రావెల్ తోలుతున్నారు. బరితెగించి పేదల దళితుల ఇళ్లకు దారులు కూడా లేకుండా భారీ ప్రహరీ గోడలు నిర్మిస్తున్నారు. అధికార పార్టీ అండదండలతోనే ఇంతగా రెచ్చిపోతున్నారన్నారు. తక్షణమే అక్రమంగా వేసిన వెంచర్లు భారీ ప్రహరీ గోడల నిర్మాణాలపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని వేదిక కోరింది. ఈ భారీ ప్రహరీ గోడ అక్రమ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపింది. ప్రజలు భారీ ప్రహరీ గోడల అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రజలకు ప్రజా స్వామిక హక్కుల పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. కార్యక్రమంలో ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక సభ్యులు కరవది భాస్కర్, చింతాల వెంకట్రావు, పసుపులేటి పెంచలయ్య(సిపిఎం), దావులూరి దేవకుమార్, పొబ్బ సాయి విటల్, జి నాగార్జున, కే నరసింహం, ఎల్ లక్ష్మిరెడ్డి, పసుపులేటి మహేష్, గోసాల రవికాంత్, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.










