ప్రజాశక్తి-ప్రతినిధి నెల్లూరు :ప్రశాంతతకు నిలయంగా ఉన్న సింహపురి ఇటీవల కాలంలో అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు నిలయంగా మారుతోంది..ఎటూ చూసినా ఆందోళన కనిపిస్తోంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో అవినీతి చోటు చేసుకుంటున్నా చర్యలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. అధికారపార్టీ నేతల వత్తిళ్లతో కింద స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు మౌనంగా ఉంటున్నారు. చర్యలు నామమాత్రంగా ఉండడంతో అందరూ ఏదొక అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల సివిల్ సప్లరు కుంభకోణం, అటు తరువాత ఇందుకూరుపేట మహిళా బ్యాంక్‌లో కుంభకోణం, అదే మండలంలో కరోనా నిధుల కాజేసిన కుంభకోణం, ఇటీవల ఉపాధి హామీ నిధుల కుంభకోణం, నెల్లూరు నగరం, చుట్టుపక్కల అక్రమ లేవుట్లు, కట్టడాలు, గ్రావెల్, ఇసుక అక్రమ తరలింపు ఇంతా జరుగుతున్నా ఎక్కడా అడ్డుకట్ట పడడం లేదు. అధికారులు చర్యలు తీసుకోడానికి భయపడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి..
సింహపురి ఒకప్పుడు ప్రశాంతతకు మారు పేరు. గత కొంత కాలంలో అవినీతి, అక్రమార్కులు పెట్రేగిపోతున్నారు. భయం లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తప్పుచేసిన వారిపై చర్యలు లేకపోవడంతో ఇతరులు అదే పద్ధతిలో ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల సివిల్ సప్లరులో భారీ కుంభకోణం జరిగింది. సుమారు రూ. 100 కోట్ల కుంభకోణంలో రూ.40 కోట్లు రికవరీ చేశారు. 33 మందిని అరెస్ట్ చేశారు. అప్పటి కలెక్టర్ చక్రధర్‌బాబు ఈ విషయమై సీరియస్‌గా వ్యవహరించారు. జెసి కూర్మానాధ్‌ను ప్రత్యేక అదికారిగా నియమించి తప్పుచేసిన వారిని అరెస్ట్ చేయించారు. దీంతో కొంత బయపడినా తరువాత జరిగిన పరిణామాలతో షరా మాములుగానే సాగుతోంది. ఇందుకూరుపేట మండలంలో మహిళా బ్యాంక్‌లో కుంభకోణం జరిగింది. ఇక్కడ సభ్యులు కుంభకోణానికి పాల్పడ్డారు. అధికారులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు నివేదిక సిద్ధంకాలేదు. అదికార, ప్రతిపక్షపార్టీల నేతల సతీమణులు ఈ కుంభకోణంలో సూత్రదారులు తెలుస్తోంది. వీరిని రక్షించుకోడానికి స్థానిక అధికారపార్టీ నేతలు సిఫార్సులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆడిట్ సరిగా లేకపోవడం, అసలు అడిట్ చేసిన అధికారులు చేతివాటంతోనే ఇలాంటి కుంభకోణాలు సాగుతున్నట్లు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. అవినీతి, అక్రమాలు జరిగినప్పుడు విచారణ సంస్థలు, ఆడిట్ అధికారులు విధులు సక్రమంగా నిర్వహిస్తే ఇలాంటి పరిస్థితులు కనిపించవు. నెల్లూరు నగరంలోని సుమారు 118 అక్రమ అలేవుట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.వాటిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతాధికారులకు లేఖలు రాసినా ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి మార్పు కనిపించలేదు. అల్లీపురంలో ఇరిగేషన్ కాలువలను పూడ్చివేసి సుమారు 6.5 ఎకరాలు భూమిలో ప్లాట్లు వేశారు. టిడిపి నేతల సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తన స్వగ్రామంలో ఈ అక్రమాలు జరగడంతో అప్పటి కలెక్టర్ చక్రధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విచారణ జరిపి అక్రమణ జరిగింది వాస్తవమేనని తేల్చారు. ఇరిగేషన్ అధికారులు తమ భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఆపని జరగలేదు. ఇరిగేషన్ అధికారులు తమ భూములు ఆక్రమించుకుంటున్నా అధికారపార్టీ నేతల బెదిరింపులకు భయపడి అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. స్థానికలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశించినా, కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినా అక్కడ అమలు జరగడం లేదు. అధికారపార్టీ నేతలు ఏం చెబితే అదే సాగుతోంది. అధికారులు ఆదేశాలు అమలు కావడం లేదు. యథేచ్ఛగా అక్రమ కట్టడాలు సాగిపోతున్నాయి. ప్రజల్లో అధికారుల పట్ల చులకన బావం కలుగుతోంది. ఈ విషయంలో జెసి విచారణ పూర్తి చేసి, కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు తెలుస్తోంది. కలెక్టర్ హరినారాయణ ఎలాంటి చర్యలూ తీసుకుంటారోనని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇందుకూరుపేట మండలంలోనే ఇటీవల ఉపాధి కూలీలో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. నిడుముసలి గ్రామంలో ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, భూస్వాములు ఉపాధి కూలీలకు రావాల్సిన నగదును వారి ఖాతాల్లో జమచేసుకున్నారు. విచారణ జరిగింది. ఏం చర్యలు తీసుకున్నారో తెలియాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి పనులు జరగకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అధికారపార్టీ నేతలు అవినీతి, అక్రమాలకు ఊతమిస్తున్నారు. ఒకరిద్దరి పై చర్యలు తీసుకోకపోతే అధికారుల ఉనికే ప్రమాదం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.










