అక్రమాలను ప్రశ్నిస్తే షోకాజు నోటీసులా?- ఫ్యాప్టో చైర్మన్ మాదన విజయ కుమార్
కడప అర్బన్ ;
పాధ్యాయుల పని సర్దుబాటులో నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించిన జిల్లా విద్యాశాఖాధికారి అక్రమాలను ప్రశ్నిస్తే ఉపాధ్యాయ సంఘ నాయకులకు షోకాజు నోటీసులు జారీ చేయడం దారుణమని ఫ్యాప్టో కడప జిల్లా చైర్మన్ మాదన విజయకుమార్ విమ ర్శించారు. ఆదివారం యుటిఎఫ్ భవన్‌లో ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల పని సర్దుబాటులో ఇష్టారాజ్యాంగా వ్యవహరించిన విద్యాశాఖాధికారిని ప్రశ్నించిన యుటిఎఫ్ నాయకులకు, అదేవిధంగా ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారనే కారణాన్ని చూపి మరికొంతమంది ఉపాధ్యాయ సంఘం నాయకులకు జిల్లా విద్యాశాఖాధికారులు షోకాజు నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఇటీవల విద్యాశాఖాధికారులు ఏదో ఒక కారణంతో ఉపాధ్యాయులను వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పాఠశాలల తనిఖీల పేరుతో ఒకపక్క ఉపాధ్యాయులను వేధిస్తూ, మరో పక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారనే సాకు చూపి ఉపాధ్యాయ సంఘ నాయకులకు షోకాజు నోటీసులు జారీ చేసి వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. జరగని దానిని జరిగినట్లు సష్టిస్తూ నోటీసులు జారీ చేస్తున్నారంటే ఉపాధ్యాయ సంఘాల పట్ల వారి కక్ష సాధింపు చర్యలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందన్ళారు. యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా,రూటా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సయ్యద్ ఇగ్బాల్ మాట్లాడుతూ పాఠశాలలలోని మిగులు ఉపాధ్యాయులను, సబ్జెక్టు కన్వర్షన్ ఉపాధ్యాయులను అవసరమైన చోట సర్దుబాటు చేయాలని పాఠశాల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. ఆ మేరకు సీనియారిటీ ప్రాతిపదికన కౌన్సిలింగ్ నిర్వహించి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉండగా, జిల్లా విద్యాశాఖాధికారి అందుకు భిన్నంగా పైరవీలకు తలొగ్గి తన ఇష్టారాజ్యంగా నియమకాలు చేపట్టారని విమర్శించారు. విద్యాశాఖాధికారి వైఖరి వల్ల సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోవడంతో పాటు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పని సర్దుబాటును సవరించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాల్సిందిగా యుటిఎఫ్ నాయకులు ప్రాతినిథ్యం వహిస్తే సమస్యను సామరస్యంగా పరిష్కరించాల్సిన డిఇఒ అందుకు భిన్నంగా నాయకులను ఛాంబర్ నుంచి బయటకు వెళ్ళమనడం తగదన్నారు. డిఇఒ వైఖరి నిరసిస్తూ ఆందోళన చేపడితే పోలీసులను పిలిపించడంతోపాటు, తప్పుడు ఆరోపణలు చేస్తూ షోకాజు నోటీసులు జారీ చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. తక్షణమే ఉపాధ్యాయ సంఘ నాయకులకు ఇచ్చిన షోకాజు నోటీసులను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌టియు జిల్లా అధ్యక్షుడు పి.రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.అబ్దుల్లా, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబులు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారనే సాకుతో ఉపాధ్యాయ సంఘాలను వేధించడం సబబు కాదన్నారు. అభ్యర్థులను ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ ఓటర్లు సంతకం చేయాల్సి ఉన్నప్పుడు ఓటర్లుగా ఉన్న ఉపాధ్యా యులు హాజరుకాకుండా ఎలా ఉంటారో ప్రభుత్వం, విద్యాశాఖాధికారులే సమాధానం చెప్పాలన్నారు. అధికారులు వేధింపులు మానకపోతే తగు మూ ల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా విద్యాశాఖాధికారి అక్రమలపై జిల్లా కలెక్టర్‌తో పాటు, పాఠశాల విద్యా కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు.










