కదిరి టౌన్ : అంగన్వాడీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి అక్రమంగా వసూళ్లకు పాల్పడిఉంటే చర్యలు తప్పవని ఐసిడిఎస్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ పద్మజ హెచ్చరించారు. పది రోజుల కిందట అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎ. సిరికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కదిరి పడమర ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో జరుగుతున్న అక్రమాలపై వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి తిష్ట వేసి ఆక్రమాలకు పాల్పడుతున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు డైరెక్టర్ సిరి ఆదేశాల మేరకు రీజినల్ జాయింట్ డైరెక్టర్ పద్మజ మంగళవారం కదిరి పడమర ప్రాజెక్టును తనిఖీ చేశారు. అవినీతి అక్రమాలపై అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కదిరి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో చోటు చేసుకున్న అక్రమాలపై డైరెక్టర్ విచారణకు ఆదేశించారన్నారు. ఆమె ఆదేశాల మేరకు విచారణకు వచ్చామన్నారు. అమడగూరు, ఒడిసి, నల్లమాడ పరిధిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ప్రతి పనికి కార్యకర్తల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఏళ్ల తరబడి అధికారులు తిష్ట వేసి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారన్నారు. ప్రాజెక్టు లో సంవత్సరాల తరబడి తిష్ట వేసిన అధికారులను బదిలీ చేస్తామని చెప్పారు. విచారణ చేస్తున్నామని నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని చెప్పారు.
అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ ఆధ్వర్యంలో వినతి : సత్య సాయి జిల్లా పరిధిలో పెండింగ్ బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుందని, ఇంటి అద్దెలు, కూరగాయలు, గ్యాస్ బిల్లులు మూడు సంవత్సరాల నుండి అందడం లేదని అంగన్వాడి వర్కర్స్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు మాబున్నీసా, కార్యదర్శి శ్రీదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీలు రీజినల్ డైరెక్టర్ పద్మజకు వినతిపత్రం అందజేశారు. అలాగే ప్రాజెక్టు పరిధిలో కొందరు వర్కర్లకు వేతనాలు పడడం లేదన్నారు రిటైర్మెంట్ పొందిన వారికి బెనిఫిట్స్ వర్తింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జిఎల్. నరసింహులు, లక్ష్మీనారాయణ, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.










