Jan 08,2023 21:21

విలేకరుల సమావేశంలో పాల్గొన్న నాయకులు

పెనుకొండ : దుకాణదారుల నుంచి అక్రమ వసూలు ఆపాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని బాబయ్య స్వామి ఉరుసు సందర్భంగా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న దుకాణదారులతో నగర పంచాయతీ వారు అధికారికంగా దుకాణం విస్తీర్ణం ఆధారంగా నెలసరి అద్దె వసూలు చేశారని, వీటికి రసీదు కూడా ఇచ్చారని అన్నారు. ఇంతవరకు బాగుంది కానీ ప్రయివేటు వ్యక్తులు రోజు దుకాణదారులు దగ్గర అక్రమ దందా వసూలు చేస్తున్నారని విమర్శించారు. దుకాణదారులకు వ్యాపారం లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వారిని బెదిరిస్తూ రోజువారి సుంకం వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ స్పందించి దుకాణదారులకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి రమేష్‌, సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, సిఐటియు నాయకులు వజ్రం నాగప్ప, రెడ్డిప రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.