అక్రమ రియల్ ఎస్టేట్‌పై విచారణ చేపట్టాలి
ప్రజాశక్తి-కావలి : కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, దోపిడీపై విచారణ జరిపించాలని, కావలి నియోజకవర్గంలో కుంటుపడిన అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని కోరుతూ కావలి ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించి, ఆర్‌డిఒ వి. కె. శీనా నాయక్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వేదిక కన్వినర్ కరవది భాస్కర్ మాట్లాడుతూ నుడా అనుమతులు లేకుండా కావలి ఎంఎల్‌ఎ అనుమతులతో, ఎంఎల్‌ఎ భాగస్వామిగా సుమారు 500 ఎకరాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేయడానికి 500 ఎకరాలకు 40 లక్షల చొప్పున సుమారు 200 కోట్లు తీసుకుని పెద్ద కుంభకోణంకు తెరతీశాడని ఆరోపించారు. ఈ వెంచర్లల్లో కనీసం నిబంధనలు పాటించక పోగా ప్రభుత్వ స్థలాలు, పోరంబోకు భూమి, కుంటలు, పంట కాలువలు, డ్రెయినేజీ కాలువలు, చేరువులను ఆక్రమించి వెంచర్లు వేశారన్నారు. ఈ కాలువలు ఆక్రమణల వల్ల వరద నీరు ఇటుపోక భవిష్యత్తులో కావలి కనకపట్నం అవుతుందో లేదో గానీ వరద పట్టణంగా అవుతుందని ఎద్దేవా చేశారు. అలాగే కావలి మున్సిపల్ స్థలాలు మాయమవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా కావలి మున్సిపల్ స్థలాల రిజిస్టర్‌ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కావలిలో అధికారులు ఎం. ఎల్. ఏ కలిసి నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఎం నాయకులు పి.పెంచలయ్య మాట్లాడుతూ పట్టణంలో, నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు. 100 గ్రామాల ప్రజలకు అవసరమైన పెద్దపవని ఫ్ల్రైఓవర్ బ్రిడ్జీ 10సంవత్సరాల నుండి అసంపూర్తిగా ఉందన్నారు. ఫలితంగా ప్రజలు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలోనే అమతపధకం క్రింద 90శాతం పనులు పూర్తయిన వాటర్ ట్యాంకులు నిరుపయోగంగా మారినందున ఇప్పటికీ ట్రాక్టర్లతో ప్రజల అవసరాలను తీర్చాల్సిన దుస్తితికి వచ్చిందన్నారు. మురుగు నీటి శుద్ధి కేంద్రం కూడా పూర్తి చేయలేకపోతున్నారన్నారు. కావలి శివారు ప్రాంతాల ప్రజలు నేటికి మంచినీరు అందక, రోడ్లు, కాలువలు, విద్యుత్సౌకర్యం లేక తీవ్ర అవస్తలుపడుతున్నారని తెలిపారు. అలాగే ఉదయగిరి ప్లై ఓవర్ బ్రిడ్జి సామర్థ్యానికి మించిరవాణా జరుగుతుందన్నారు. పలితంగా అదికూలే ప్రమాదం ఉందన్నారు. ట్రంకురోడ్డు విస్తరణ ఆగుతూ సాగూతూ ఎప్పుడు పూర్తవు తుందో అర్ధం కానీపరిస్థితి ఉందన్నారు. అంతేకాక మంజూరైన అంబేద్కర్, జగ్జీవన్ రాం భవనాలు, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ డిగ్రీకాలేజీ, కాలేజీ విద్యార్థులకు వసతి గృహాలు కూడా పూర్తి చేయాలన్నారు. తుమ్మలపెంట రోడ్డు, బట్లదిన్నె, తాళ్లపాలెంరోడ్లు శిలాఫలాకాలకే పరిమితమయ్యాయన్నారు. రూరల్, ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నమన్నారు. కనుక ప్రజలకు తక్షణ మౌలిక వసతులను కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. టిడిపి నాయకులు జ్యోతిబాబురావు మాట్లాడుతూ కావలి పట్టణంలో మున్సిపల్ అవినీతి విలయతాండవం చేస్తుందన్నారు. జమాఖర్చులు ఆడిటింగ్లేదన్నారు. పారిశుధ్యం లేదని పందులు, కుక్కలు, దోమలతో పట్టణ ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. అక్రమ నిర్మాణాలు, పార్కింగ్ లేనిషాపింగ్మాల్స్విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. జనసేన నాయకులు పోబ్బ సాయి మాట్లాడుతూ వందల ఎకరాలు చెరువులు మాయమవుతున్నాయని, విలువైన ప్రభుత్వ స్థలాలు అక్రమణకు గురై కావలి వట్టి పోతుందన్నారు. సిపిఐఎంఎల్ నాయకులు ఎల్.లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ కావలి పట్టణ, నియోజకవర్గంలో జరుతున్న అవినీతి, దోపిడీపై విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. రిపబ్లికన్ పార్టీ నేత పసుపులేటి మహేష్, స్త్రీ విముక్తి నుండి శ్యామల, తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో గుత్తికొండ కిషోర్, శ్రీహరినాయుడు, రఫీ, మస్తాన్, అమరావతి జ్యోతి, పద్మ, మధుసూదన్, బి.కృష్ణయ్య, వై.కృష్ణ మోహన్, నాగార్జున, హఫీజ్, ప్రవీణ్, కల్లయ్య, రవి, వేణు, తదితరులు పాల్గొన్నారు.










