ప్రజాశక్తి-హిందూపురం : కేంద్రంలో మతతత్వ అజెండాతో అధికారంలో ఉన్నా మోదీ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెట్టినా, బెదరింపులకు దిగనా, భయపడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ అన్నారు. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారంలో బిజెపి కుట్ర పన్ని అక్రమ కేసు నమోదు చేయించి, రెండు సంవత్సరాలు రాహుల్ గాంధీకి శిక్ష విధించడాన్ని నిరసిస్తు శుక్రవారం పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్‌లో మోకాళ్లపై కుర్చోని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా నాయకులు సుధాకర్, బాలాజీ మనోహర్ మాట్లాడుతు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా...రాచరికంలో ఉన్నామా అర్థం కావాడం లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సైతం కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లోను మోడీతో పాటు అమీత్ షా, ఇతర బిజెపి నాయకులు ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నా వారిపై ఏలాంటి కేసులు నమోదు చేయకుండా తప్పును తప్పు అని చెప్పిన రాహుల్ గాంధీపై అక్రమ కేసులను పెట్టి, చివరకు న్యాయ స్థానాలను అడ్డు పెట్టుకుని శిక్షలను విధిస్తు ప్రజలను, ప్రతిపక్ష నేతలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. భారత్ జోడో యాత్రతో రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావడంతో పాటు రాహుల్ రాజకీయంగా ఎదుగుతారని తెలిసి అక్రమ కేసులు పెట్టడానికి మతతత్వ పార్టీ పూనుకుందన్నారు. వెంటనే రాహుల్‌పై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని, క్షమాపణ చెప్పక పోతే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి జైల్‌భరో కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, అజ్మతుల్లా, యూనూస్, జమీల్, రామాంజినేయులు, గంగాధర్, మహాభూబ్ భాష, పారుసాబ్, రఫీక్, గౌస్, వరదరాజు తదితరులు పాల్గొన్నారు.










