అక్రమ అరెస్టులకు సిఐటియు నిరసన
ప్రజాశక్తి-కావలి : అంగన్‌వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) 20వ తేదీన ఇచ్చిన ''చలో విజయవాడ'' కార్యక్రమానికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటూ పోలీసులతో ముందస్తు నోటీసులు ఇప్పించి కార్యక్రమానికి పోయే వారిని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని ఖండిస్తూ, సోమవారం ఉదయగిరి రోడ్డు కూడలిలో అంబేద్కర్ బొమ్మ వద్ద అంగన్‌వాడీ వర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పసుపులేటి పెంచలయ్య మాట్లాడుతూ అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఎన్నోసార్లు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ హామీలను అమలు చేయకుండా వర్కర్లపై పనిభారాన్ని పెంచుతున్నందున సమస్యలు పరిష్కరించాలని ''చలో విజయవాడ'' కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య అని ఇలాంటి ఆలోచనలను ప్రభుత్వ మానుకోవాలని వెంటనే అంగన్‌వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు పట్టణ కార్యదర్శి వై.కృష్ణమోహన్ మాట్లాడుతూ అక్రమ అరెస్టులను సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అంగన్‌వాడీ వర్కర్ల న్యాయమైన సమస్యలు అన్నింటిని పరిష్కరించాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గ్రాట్యూటి ఇవ్వాలని వర్కర్ల ముఖ యాప్‌ను రద్దు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్, సెంటర్లుగా మార్చాలని, వర్కర్ల పనిభారాన్ని తగ్గించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాబోవు రోజులలో పెద్దఎత్తున పోరాటాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.కృష్ణయ్య, షేక్.అమీర్ బాషా, అంగన్‌వాడీ నాయకులు గద్దగుంట సుజాత, కసుపర్తి వరలక్ష్మి, కామేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.










