Apr 22,2023 20:27

పాటూరు పంచాయతీలో నేలకొరిగిన వరి పంట

నందలూరు : జిల్లాలో అకాలవర్షం ధాటికి భారీ నష్టం వాటిల్లింది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా శుక్రవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడినా గాలివానతో జిల్లా వ్యాప్తంగా ఉద్యాన, వ్యవసాయ పంటలు నేలకొరిగాయి జిల్లాలోని రాజంపేట, నందలూరు, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేలి, రాయచోటి, తదితర మండలాల్లో వందలాది ఎకరాల్లో మామిడి, అరటి, బొప్పాయి, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

అకాల వర్షానికి నందలూరు మండలంలోని పాటూరు, నాగిరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలతోపాటు మండలంలోని వివిధ ప్రాంతాలలో దాదాపు వందల ఎకరాలలో వరి పంట చేతికి వచ్చే సమయంలో నేలకొరిగింది. రైతులు లబోదిబోమంటున్నారు. ఎకరాకు దాదాపు రూ.65 వేలు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాటూరుతో పాటు మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో దాదాపు వందల ఎకరాలలో మామిడి తోటలో మామిడికాయలు రాలిపోయాయి. చెట్లు నేలకొరిగాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా జరగడంతో రైతులు తమకు జరిగిన నష్టాన్ని ఎలా తీర్చు కోవాలో అర్థం కావడం లేదని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
చేతికొచ్చిన పంట నేలపాలు
ఆరుగాలం కష్టపడి పంటించుకున్న మామిడి చేతికి అంది వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యంతో చెట్లు నేలకొరిగాయి. కాయలన్నీ రాలిపోయాయి. తీవ్ర నష్టం ఏర్పడింది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి.
- వెంకటయ్య, మామిడి రైతు, కుమ్మరపల్లి, నందలూరు.
చేతికొచ్చిన పంట నీటి పాలు
ఇంటిల్లిపాదితోపాటు, మనుషులను పెట్టుకొని పండించుకున్న వరి పంట అకాల వర్షానికి నేలకొరిగింది. త్వరలో కోత కోయాల్సి ఉంది. పంట చేతికొస్తే తమ కష్టాలు తీరుతాయని అనుకుంటే మరింత ఎక్కువయ్యాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలి.
- వల్లూరి పెంచలయ్య, వరి రైతు, కుమ్మరపల్లి, నందలూరు.