Oct 06,2022 22:40

ప్రజాశక్తి-కంచికచర్ల: ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు రోజులుగా కంచికచర్ల మండలంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో కంచికచర్ల మండలంలో ఆరు సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మండలంలో పత్తి పొలాలు నీట మునిగాయి. ఈ ఏడాది 10,200 ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ప్రస్తుతం పత్తి పంట పూత పిందె, కాయ వివిధ దశల్లో ఉంది. చెవిటికల్లు, కునికినపాడు, మున్నలూరు, మోగులూరు, పరిటాల, గని ఆత్కూరు, కొత్తపేట, వేములపల్లి, గొట్టుముక్కల, యస్‌ అమరవరం, పెండ్యాల ప్రాంతాల్లో పత్తి ఈదురుగాలులకు నేల వాలింది. దీనికి తోడు పొలాల్లో నీరు నిలబడటం వల్ల పూత, పిందే రాలిపోయే అవకాశం ఉంది. నీటిలో నానడం వల్ల కాయలు కుళ్లిపోయే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం తగ్గుముఖం పట్టకపోతే పత్తి మొక్కలు చనిపోయే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. పత్తి పొలాల్లో నిల్వ చేరిన వర్షం నీటిని బయటకు పంపించి పొటాష్‌ లాంటి మందును పిచికారి చేయాలని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. భారీ వర్షానికి కంచికచర్లలోని బస్టాండ్‌ వద్ద, పాత సినిమా హాలు, మధిర వెళ్లే రహదారిపై పడ్డ గోతుల్లో వర్షం నీరు చేరింది.
ప్రజాశక్తి-తిరువూరు: భారీ వర్షానికి తిరువూరు పట్టణం మెయిన్‌ రోడ్డు, ఎమ్మెల్యే కార్యాలయ ప్రాంతంతో పాటు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద మెయిరోడ్డుపై సుమారు నడుములోతులో వర్షం నీరు ప్రవహించటంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. షాపుల్లోకి వరద చేరడంతో చిరు వ్యాపారులు, చేత్తివత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన డ్రెయినేజీ వ్యవస్థ లేక పట్టణంలో రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ప్రజాశక్తి-వత్సవాయి: మండలంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం కారణంగా పత్తి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని ఆందోళన చెందుతున్నారు. పత్తి పూత నల్లగా మారింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే పంటపై ఆశలు వదులుకోవడమేనని రైతులు అంటున్నారు. ప్రజాశక్తి-నందిగామ: మండలంలోని రాఘవాపురం, కమ్మవారిపాలెం గ్రామాల్లో పత్తి పొలాల్లోకి నీరు చేరింది. మండలంలో ఈ ఏడాది పత్తి సాగు గణనీయంగా పెరిగింది. సుమారు 30 వేల ఎకరాల్లో పత్తి సాగైంది. ఎకరానికి రూ.30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. కౌలు అదనంగా మరో పది వేలు ఖర్చు అవుతుంది. గత రెండు రోజుల నుంచి కురిసిన వానకు పత్తి నల్లగా మారింది. ఆకాల వర్షాలకు నందిగామ శివారు అనాసాగరం నుంచి పెనుగంచిప్రోలు వెళ్లే ప్రధాన రహదారి (శనగపాడు రోడ్డు)పై శనగపాడు వాగు పొంగి పొర్లుతుంది. నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామంలో నల్లవాగుపై వర్షపు నీరు చేరింది. వైరా-కట్టలేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.