ప్రజాశక్తి-నెల్లూరు : ప్రజాశక్తి-నెల్లూరు :అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళలంతా ఏకతాటిపై నిలిచి మహిళలపై నేటికీ కొనసాగుతున్న అసమానతలు, వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించి సమానత్వ సాధనకు కృషి చేయాలని ఎంఎల్‌సి విటపు బాలసుబ్రమణ్యం పిలుపునిచ్చారు. ఆదివారం జెట్టిశేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలు రంగాల్లో పనిచేస్తున్న ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. సదస్సుకు ముఖ్య అతిథులుగా విఠపు బాలసుబ్రహ్మణ్యం, రంజిత నళిని, సైకాలజీ ప్రొఫెసర్ గాయత్రి, ఎల్‌ఐసి యూనియన్ మహిళా విభాగం కన్వీనర్ పిసి మాళవిక చక్రవర్తి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి విఠపు బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మహిళలు 113 ఏళ్ల కిందట అమెరికాలోని న్యూయార్క్‌లో వస్త్ర మిల్లులో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికులు పనిగంటలు, కనీస వేతనాల కోసం, ఓటు హక్కు కోసం పోరాటం చేశారన్నారు. ఆ సందర్భంగా జరిగిన కాల్పుల్లో యజమానుల చేతిలో 35 మంది మహిళలు మృతిచెందారన్నారు. ఆ దుర్ఘటన ప్రపంచ దేశాల్లోని మహిళా లోకాన్ని కలిచివేసిందన్నారు. ఆ నేపథ్యంలో వివిధ దేశాల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చర్చ జరిగిందన్నారు. ఆ సందర్భంగా ఓ ప్రణాళి కాబద్ధంగా ముందుకెళ్లాలని నిర్ణయిం చారన్నారు. అప్పటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయం తీసుకు న్నారన్నారు. ఆ మేరకు 1910, మార్చి 8న మొదటి మహిళా దినోత్సవం జరిగిందన్నారు. నాటి నుంచి నేటి వరకు మహిళా దినోత్సవం స్ఫూర్తితో మహిళలు తమ సమస్యలపై పోరాటాలు చేస్తున్నారన్నారు. మహిళా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలో రాణిస్తున్నప్పటికీ వివక్షతకు గురవుతున్నారన్నారు. ఈ వివక్షతను అధిగమించాలన్నా.. మహిళల సమానత్వాన్ని సాధించాలన్నా మహిళలందరూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు. యువత మాదకద్రవ్యాలకు, అశ్లీల చిత్రాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అదే సమయంలో విద్యార్థులు చదువుకోవాలని, విదేశాల్లో ఉద్యోగాలు లక్షల్లో జీతాలు తీసుకోవాలన్న ఆశతో ఒత్తిడి, మరో వైపు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాల వేధింపులను తట్టుకోలేక కొంత మంది, ప్రేమ పేరుతో స్నేహితుల అరాచకత్వానికి ప్రమిదలుగా మారి మరి కొంత మంది తమ ప్రాణాలు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళా సంఘాలు ఐక్యవేదికలను ఏర్పాటు చేసుకొని మహిళలను చైతన్యపరచాల్సిన అవసర ముందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి కార్యదర్శి షేక్ మస్తాన్ బి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ డి అన్నపూర్ణమ్మ, ఆర్‌టిసి మహిళా కండక్టర్ల విభాగం నుంచి రాజమ్మ, అంగన్‌వాడీ జిల్లా కార్యదర్శి రెహనా బేగం, జన విజ్ఞాన వేదిక సమతా విభాగం విజయలక్ష్మి , డికెడబ్ల్యూ కళాశాల విశ్రాంతి లెక్చరర్ భారతీ, ఐద్వా నగర కార్యదర్శి కె.పద్మా, ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి ,అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ ,జిల్లా అధ్యక్షురాలు టి శివకుమారి పాల్గొన్నారు.










