ప్రజాశక్తి - రాయచోటి టౌన్: ఐక్య పోరాటాల ద్వారానే రాష్ట్ర, దేశవ్యాప్తంగా ఉన్న అసంఘటిత కార్మికుల సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పడుతుందని సిఐటియు రాష్ట్ర నాయకులు అన్నారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో సిఐటియు జిల్లా మొదటి మహాసభలు నిర్వహించారు. మహాసభలకు రైల్వేకోడూరు, రాజంపేట, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లె నుంచి పెద్ద ఎత్తున కార్మికులు హాజరయ్యారు. ముందుగా మాసాపేట మీదుగా మదనపల్లె రోడ్డులోని విద్యుత్ కార్యాలయం వరకు కార్మికులు సిఐటియు జెండాలు పట్టుకొని భారీ ర్యాలీగా బంగ్లా సర్కిల్‌లోని మైదానంలో ఏర్పాటు చేసిన మహాసభ ప్రాంగణానికి చేరుకున్నారు. సభా ప్రాంగణమంతా కార్మికులు, కార్మిక సంఘాల నేతలతో నిండిపోయింది. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి రామాంజులు అధ్యక్షతన చేపట్టిన సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు సుబ్బరావమ్మ, బాలకాశి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా అసంఘటిత కార్మికులైన మున్సిపల్, ఆశా, అంగన్వాడీ, విద్యుత్, హమాలీలు, విఆర్‌ఎలు, భవన నిర్మాణ కార్మికులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది కార్మికులు వారి సమస్యలు పరిష్కారం కాక పలు రకాల ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి కనీస వేతనంగా రూ.26 వేలు జీతం ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా కార్మికులు పోరాటాలు చేస్తున్న ఈ ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాలనలో మనమంతా ఉన్నామని, ఆయన మాత్రం రాష్ట్రంలోని 56 శాతం మంది అత్యంత సంతోషంగా జీవిస్తున్నారని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం ఉద్యోగులకు నెల నెలా జీతాలు సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొని ఉందన్నారు.వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో సమస్యలు పెరిగాయి కానీ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం ఆయన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదన్నారు. జీతాలు పెరిగితే కుటుంబాలను పోషించుకోవచ్చునన్న కార్మికుల బాధలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సారి 175 సీట్లకు 175 రావాలని జగన్మోహన్‌రెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. కార్మికుల కడుపు కొడుతూ వారిని పట్టించుకోకుండా ఉన్నవారికి దోచిపెడుతున్న వెసిపి ప్రభుత్వానికి 175 సీట్లు ఎలా వస్తాయో మేము చూస్తామన్నారు. అన్ని రకాల కార్మికులకు మోసం చేసిన జగన్మోహన్‌రెడ్డిని ఇంటికి పంపేందుకు కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. నిర్బంధాల ద్వారా ఉద్యమాలను ఆపాలని చూస్తే ఉద్యమాలు మరింత ఉధృతం అవుతాయని ప్రభుత్వాన్ని హెచ్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ, ఆశా వర్కర్ల సమస్యలను ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పక్క రాష్ట్రాల్లో 20 వేలకుపైగా అంగన్వాడీలకు జీతాలు ఇస్తుంటే ఈ రాష్ట్రంలో కనీసం రూ.వెయ్యి కూడా జీతం పెంచిన దాఖలాలు లేకపోవడం కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. కరోనా సమయంలో అంగన్వాడీ, ఆశా, కాంట్రాక్టు, అవుట్ సోర్పింగ్ కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తే కనీసం కార్మికుల సమస్యలను పరిష్కరించిన పాపాన పోలేదన్నారు. నిబంధనల ద్వారా కార్మికుల ఉద్యమాలను ఆపాలని చూస్తే గత ప్రభుత్వాలకు పట్టిన గతే ఈ వైసిపి ప్రభుత్వాన్ని కూడా పడుతుందనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. అంగన్వాడీ, ఆశ వర్కర్లకు ప్రతినెలా ఒకటో తేదీ కల్లా జీతాలు ఇవ్వడమే కాకుండా పెండింగ్‌లో ఉన్న టిఎ, డిఎలు, ఇంటి అద్దెలు, కూరగాయల బిల్లులు సక్రమంగా చెల్లించి కార్మికుల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో అంగన్వాడీ వర్కర్లతో పాటు ఆశ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, విద్యుత్ కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరక ఎంతోమంది కుటుంబాలు పోషించుకునేందుకు కూడా నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఉద్యమాల ద్వారానే అవి సాధ్యమని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు రవికుమార్, చంద్రశేఖర్, రాజేశ్వరి, శంకరమ్మ, కరిష్మా, మధువాణి, శ్రీహరి, సుబ్రహ్మణ్యం రాజు, రమణ, నాగేశ్వర గౌడ్, భాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, ఖాజాబీ, బంగారుపాప, ప్రజానాట్య మండలి కళాకారులు వెంకట చలపతి, అంజనప్పనాయక్, సరస్వతి మల్లి, శ్రీరాములు, అరుణమ్మ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహతో పాటు అన్నమయ్య జిల్లాలోని ఆరు నియోజకవర్గాల నుండి ఆసంఘటత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.










