- కలెక్టర్ డిల్లీరావు
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంను సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు బుధవారం స్టేడియంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఇంధిరాగాంధీ స్టేడియంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్ మాన్యశ్రీ బిశ్వభూషణ్ హరిచందన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు వేడుకలలో పాల్గొంటారన్నారు. 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్న తరుణంలో అందుకు తగిన విధంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్టేడియం మైదానంలో వేడుకలకు ఇబ్బంది కలుగకుండా తగిన ఏర్పాట్లును ముందుగానే సిద్దం చేయాలన్నారు. పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, ట్రాన్స్‌కో, ఫైర్, ఏపిఎస్‌ఆర్‌టిసి, మెడికల్ అండ్ హెల్త్, సివిల్ సంప్లయి, ఐ అండ్ పిఆర్, అగ్రికల్చర్, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల విజయవంతంలో భాగస్వామ్యులు కావాలన్నారు. ఏర్పాట్ల నిర్వహణలో జిల్లా అధికారులకు అప్పగించిన భాధ్యతలను సక్రమంగా నిర్వహించి పనుల ప్రగతి నివేధికలను ఎప్పటికప్పుడు సమర్పించాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు. సమావేశంలో శాసన మండలి సభ్యులు తలశిల రఘరామ్, నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా, డిసిపి విశాల్ గున్ని, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజరు, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.










