Feb 22,2022 07:50

లింగ వివక్ష, గృహ హింస సహా పలు అంశాలపై చర్చ
న్యూఢిల్లీ :
  క్యూబన్‌ ఎంబసీకి చెందిన కొత్త దౌత్యవేత్త మలెనా రోజాస్‌ మెడినా సోమవారం న్యూఢిల్లీలోని ఐద్వా కార్యాలయాన్ని సందర్శించారు. ఐద్వా నేతలు, కార్యకర్తలతో సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు. న్యూఢిల్లీలో లోని క్యూబా ఎంబసీలో మెడినా పత్రికా, సాంస్కృతిక వ్యవహారాల ఇన్‌చార్జిగా వున్నారు. ఈ సందర్శన భారత్‌లోని ప్రగతిశీల కార్యకర్తలకు, క్యూబన్లకు మధ్య సుదీర్ఘకాలంగా వున్న స్నేహ సంబంధాలు, సంఘీభావాన్ని ప్రతిబింబిస్తోంది. లైంగిక వివక్ష, మహిళా ఉద్యమాలతో సహా ఇరు దేశాల్లోని పలు అంశాలు ఈ సమావేశంలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. క్యూబా విప్లవంలో మహిళల పాత్రను గుర్తు చేసుకున్నారు. భారతదేశంలో లైంగిక హింస, వివక్షపై ఐద్వా జరిపే పోరాటాలను కూడా ఐద్వా నేతలు పంచుకున్నారు. క్యూబా మహిళలకు ప్రభుత్వపరంగా అందే సాయం, మద్దతు గురించి మెడినా వివరించారు. పిల్లల సంరక్షణా సదుపాయాలు, వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు, 24గంటలూ అందుబాటులో వుండే ప్రభుత్వ రవాణా, గృహ హింస కేసులను పరిష్కరించేందుకు సమర్ధవంతమైన, బలోపేతమైన పరిష్కార వ్యవస్థ నెలకొనడం వంటి వివరాల గురించి మెడినా ఆ సమావేశంలో వివరించారు.

కరోనా మహమ్మారి సమయంలో కూడా క్యూబన్‌ మహిళలు అద్భుతమైన పాత్ర పోషించారంటూ ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. కోవిడ్‌ వ్యాక్సిన్లు దేశీయంగా అభివృద్ధిపరచడంతో సహా పలు రంగాల్లో మహిళలు అగ్ర భాగాన ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో సాంస్కృతిక, ఇతర కార్యకలాపాల ద్వారా క్యూబా, ఐద్వాల మధ్య పరస్పర కార్యాచరణ పెరిగేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. క్యూబన్‌ డాక్యుమెంటరీలను, క్యూబన్‌ మహిళలు నటించిన చిత్రాలను ప్రదర్శించే ప్రణాళికలు కూడా వున్నాయి. ఈ సమావేశంలో ఐద్వా నేతలు మరియం ధావలె, ఎస్‌.పుణ్యవతి, ఆశా శర్మ, మైమూనా మొల్లా, అర్చనా ప్రసాద్‌, శర్బానీ సర్కార్‌, రంజిని బసు పాల్గొన్నారు.