Feb 19,2022 09:01

చండీఘర్‌ : పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముస్తాబవుతన్న సమయంలో అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫామ్స్‌ (ఎడిఆర్‌) ఓ నివేదికను విడుదల చేసింది. గత ఐదేళ్లలో పలువురు నేతల ఆస్తుల పెరుగుదల, తరుగుదల వివరాలను పొందుపరిచింది. పంజాబ్‌ ఎన్నికల్లో తిరిగి పోటీ చేస్తోన్న 101 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లలో నమోదు చేసిన వివరాలను ఎడిఆర్‌, పంజాబ్‌ ఎలక్షన్‌ వాచ్‌ చేసిన విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. 2017 నుండి ఇప్పటి వరకు పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ సంపద రూ. 5 కోట్లు తగ్గగా.. గత ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ సంపద రూ. 20 కోట్లు పెరిగింది. ఇక శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి) అధినేత సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ ఆస్తులు గత అసెంబ్లీ ఎన్నికల నుండి ఈ అసెంబ్లీ ఎన్నికల మధ్య ఏకంగా రూ. 100 కోట్లు పెరగడం గమనార్హం.
2017 చరణ్‌ జీత్‌ సింగ్‌ తన ఆస్తుల విలువ రూ. 14.51 కోట్లు ఉండగా... ప్రస్తుతం రూ. 9.45 కోట్లుగా ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్‌ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు సంపద కూడా తగ్గింది. 2017లో రూ.45.90 కోట్లు ఉండగా.. 1.25 కోట్లు తగ్గి.. ప్రస్తుతం ఆయన సంపద విలువ రూ. 44.65 కోట్లు. 2017లో వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులతో సహా మళ్లీ పోటీ చేస్తున్న 101 ఎమ్మెల్యేల సగటు ఆస్తుల విలువ రూ. 13.34 కోట్లు కాగా.. ఇప్పుడు రూ. 16.10 కోట్లు పెరిగిందని నివేదిక తెలిపింది. గత ఐదేళ్లలో ఈ చట్టసభ్యుల సగటు ఆస్తి వృద్ధి రేటు 21 శాతం, అంటే రూ.2.76 కోట్లు. అదేవిధంగా ఈ ఐదేళ్లలో అత్యధికంగా ఆస్తులు పెరిగిన ఐదుగురు ఎమ్మెల్యేల వివరాలను వెల్లడించింది. ఇందులో ముందు వరుసలో సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ ఉన్నారు. 2017లో రూ. 102 కోట్లు ఉండగా.. ఈ ఐదేళ్లలో 100 కోట్లు పెరిగి.. ఇప్పుడు ఆయన సంపద రూ. 202 కోట్లుగా ఉంది. ఈ జాబితాలో కాంగ్రెస్‌ నేత మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ (2017లో రూ.40 కోట్ల - ఇప్పుడు రూ. 72 కోట్లు) ఆప్‌ నేత అమన్‌ అరోరా (పెరిగిన ఆస్తుల విలువ రూ. 29 కోట్లు), అమరీందర్‌ సింగ్‌, స్వతంత్య్ర అభ్యర్థి అంగద్‌ సింగ్‌ ఉన్నారు. ఫిబ్రవరి 20న మొత్తం 117 స్థానాల్లో ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది.