ప్రజాశక్తి - హెల్త్ యూనివర్శిటీ: అజ్ఞానం అనర్ధాలకి మూలమని, వ్యాధులు, ఆహారం గురించి జ్ఞానం, పరిపూర్ణ ఆరోగ్యానికి సోపానమని ప్రముఖ ఫీజీషియన్ డాక్టర్ జి.సమరం అన్నారు. బెంజిసర్కిల్ వద్ద గల వాసవ్య నర్సింగ్ హౌమ్ నందు శనివారం 'ఆరోగ్యం - అనుమానాలు, అపోహలు' అనే అంశంపై ఆరోగ్య సదస్సు జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ సమరం మాట్లాడుతూ వ్యాధులు రావడం గురించి, ఆహారం గురించి సమాజంలో అనేక మూఢనమ్మకాలు, అపోహలు ఉన్నాయని, సంపూర్ణ ఆరోగ్యానికి సరైన విజ్ఞానం అవసరమని తెలిపారు. సమాజంలో ప్రబలుతున్న అనేక మూఢనమ్మకాలకు అవిద్యతో పాటు సరైన అవగాహన లేకపోవడం ప్రధాన కారణం అన్నారు. ఆట్లమ్మ, పొంగులాంటి వ్యాధులని అమ్మవారని భావిస్తూ, మందులు వాడితే అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతామని, మందులు వాడకుండా ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారన్నారు. వేడి చేసి కళ్ళు ఎర్రబడ్డాయని, కాళ్లు గుంజుతున్నాయని ఏవేవో చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకుంటారని ఆవేదన వ్యక్తపరిచారు. మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గాలి సోకిందని లేదా ఎవరో చేతబడి, బాణామతి చేసారని భూతవైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళి మరింత బాధలకి గురి చేస్తారన్నారు. నిమ్మరసం లేదా ఫ్రిజ్‌లో నీళ్లు తాగితే జలుబు చేస్తుందని, మామిడిపళ్ళు తింటే సెగ్గడ్డలు వస్తాయని, మెల్లకన్ను అదృష్టమని, మంత్రాలకి పాము విషం విరుగుడవుతుందని, గోధుమ అన్నం తింటే సుగరు వ్యాధి తగ్గిపోతుందని అనుకోవడం కేవలం అజ్ఞానమే అన్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే గుణం అలవర్చుకుంటే మూఢనమ్మకాలు తొలుగుతాయన్నారు. శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ ధృక్పథం పెంపొందించుకుంటేనే వ్యక్తి ఆరోగ్యంతో పాటు సామాజిక ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ జి.మారు అధ్యక్షత వహించగా పి.మౌనిక పాల్గొన్నారు.










