Apr 18,2022 08:16
  • నగదు బదిలితో బియ్యం ధరలు చుక్కలనంటే ప్రమాదం
  • కేంద్రం కుట్రలో భాగమేనంటున్న నిపుణులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న బియ్యం బదులు నగదు ఇచ్చే కార్యక్రమంతో భవిష్యత్తులో ఆహార కొరత, పౌష్టికాహార లోపం తాండవం చేసే ప్రమాదం ఉందని ఆహార భద్రత నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బియ్యం వద్దనుకునే వారికి కేజీకి రూ.10 నుంచి రూ.15 ఇవ్వాలని చూస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఆకలి కేకలు పెద్దఎత్తున వినిపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి విధానాన్ని తెరమీదకు తెచ్చిందనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లు, వ్యాపారస్తులకు లాభాలు చేకూర్చాలనే దురుద్దేశంతో బియ్యం ఇవ్వకుండా నగదు బదిలీ చేయాలని వివిధ రాష్ట్రాలపై ఒత్తిడి చేస్తోందని సమాచారం. నాణ్యతలేని బియ్యం ఇస్తే, ప్రజలు తప్పకుండా నగదు తీసుకుంటారనే ఆలోచనతో నాశిరకం బియ్యాన్ని కేంద్రం రాష్ట్రానికి పంపుతోంది. కొన్నిసార్లు బియ్యం పంపకుండా జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎ) కింద కేంద్రం తన వద్ద ఉన్న 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎపికి కేవలం 90 లక్షల కార్డులకే (2,42,99,920 మందికి) రేషన్‌ లేదా దానికి సరిపడా నగదును కేజీకి రూ.36 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన పథకం కింద కూడా కేంద్రం కేవలం ఈ 90 లక్షల కార్డులకే బియ్యం తాలూకా చెల్లింపులు చేస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 56,06,681 కార్డులకు (1,55,68,927 మందికి) బియ్యం ఇవ్వలేక, ఆర్థికభారంతో విలవిల్లాడుతోంది. ఆర్థికభారం నుంచి ప్రభుత్వం తప్పించుకునేందుకు ప్రయత్నించేలా కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ కోటా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. దీనివల్ల రాష్ట్రంలో పేదల సంఖ్య పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చులు పెట్టుకోవాల్సిన పరిస్థితి.
 

                                        పేదల్ని కొట్టి, కార్పొరేట్లకు పెట్టడమే కేంద్రం లక్ష్యం

కేజీకి రూ.15 చొప్పున నగదు చెల్లిస్తే, ప్రజలు వాటిని సులువుగా ఖర్చు చేసేస్తారు. వారికి తినడానికి బియ్యం ఉండవు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. రిలయన్స్‌, డిమార్ట్‌, మెట్రో తదితర గుత్తపెట్టుబడిదారుల మాల్స్‌లో గంపగుత్తగా నిల్వలు పెట్టుకుని, బియ్యం ధరలను కార్పొరేట్లు ఇష్టానుసారం పెంచుకునే వీలు కలుగుతుంది. తినాలంటే ఖచ్చితంగా వారు పెట్టిన ధరకే బియ్యం కొనుగోలు చేయాలి. ఆ సమయంలో కేజీ బియ్యం రూ.100కు చేరే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంబానీ, అదానీ వంటి బడా పెట్టుబడిదారుల కడుపు నింపడానికి, పేద ప్రజల నోటి వద్ద ముద్దను మోడీ లాక్కుంటున్నారంటూ మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

                                              ఆర్థికభారం దింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

రాష్ట్రంలో ప్రస్తుతం నాన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎ 56,06,681 రేషన్‌ కార్డులు (రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినవి), వాటిలో 1,55,68,927 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ కార్డులన్నిటికీ నెలకు 7.78 కోట్లు కేజీల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. కేజీకి రూ.36 చొప్పున ప్రభుత్వం నెలకు రూ.280 కోట్లు, సంవత్సరానికి రూ.3,362.88 కోట్లు ఖర్చు పెడుతోంది. దీంతోపాటు బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొబైల్‌ డెలివరీ యూనిట్‌ (ఎండియు)లు 9,260 నిర్వహిస్తోంది. దీనికి నెలకు ఒక్కో డ్రైవర్‌కు రూ.18 వేలు చొప్పున రూ.16.66 కోట్లు, ఏడాదికి రూ.200 కోట్లు భారం పడుతోంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం నాన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎ కార్డులకు రేషన్‌ బియ్యం ఇచ్చేందుకు ఏడాదికి రూ.3,562.90 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీని నుంచి తప్పించుకునేందుకు నాన్‌ ఎన్‌ఎస్‌ఎఫ్‌ఎ కార్డులకు నగదు బదిలీ చేయాలని భావిస్తోంది. బియ్యం వద్దనుకునే వారికి కేజీ బియ్యానికి రూ.15 ఇస్తామని చెబుతోంది. దీని పైలెట్‌ ప్రాజెక్టును రాష్ట్రంలో 5 మున్సిపాలిటీలు (గాజువాక, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, నంద్యాల)లో మే నెలలో నిర్వహించాలని పౌరసరఫరాలశాఖ కమిషనరు ఆయా మున్సిపాలిటీల అధికారులకు సర్క్యులర్‌ పంపారు.
    రాష్ట్రం మొత్తం బలవంతంగా అయినా నగదు బదిలీ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు రూ.116.76 కోట్లు, ఏడాదికి రూ.1,401.20 కోట్లుతో పనైపోతుంది. అసలు ఈ నగదు బదిలీ విధానం నెలనెలా సక్రమంగా అమలు అవుతుందా, లేదా అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగదు బదిలీ పథకం అమలైతే తమ పరిస్థితి ఏంటని ఎండియు డ్రైవర్లు ఆలోచనలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీ విధానాన్ని ప్రారంభించకముందే ప్రజల నుంచి దీనిపై సర్వత్రా విమర్శలు, వ్యతిరేకత వెల్లువెత్తుతున్నాయి. తినడానికి అనువైన బియ్యం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.