Jan 29,2023 21:54

టి.అనిల్‌ కుమార్‌

రాయచోటి :జిల్లాలో అగ్ని ప్రమాదాలను అరికట్టడమే తమ లక్ష్యం జిల్లా అగ్నిమాపక అధికారి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన అన్నమయ్య జిల్లాలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆయన ప్రజాశక్తితో ముఖాముఖి ద్వారా ఆయన వివరించారు.
జిల్లాలో ఫైర్‌ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి? ఎక్కడున్నాయి?
హొ జిల్లా వ్యాప్తంగా ఫైర్‌ స్టేషన్లు 8 ఉన్నాయి. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రాజంపేట, రైల్వేకోడూర్‌, పీలేరు, వాల్మీకిపురం, మదనపల్లి, ములకలచెరువు ప్రాంతాలలో ఫైర్‌ స్టేషన్లున్నాయి. 8 వాహనాలు, జీపు, బుల్లెట్‌ ఉన్నాయి.
జిల్లాలో బాణసంచా ఫ్యాక్టరీలు ఎన్ని ఉన్నాయి?
హొ జిల్లాలో లైసెన్స్‌ ఫ్యాక్టరీలు 9 ఉన్నాయి. రాయచోటిలో 6, రైల్వేకోడూరు 2, పుల్లంపేటలో ఒక ఫ్యాక్టరీ ఉంది.
ఫైర్‌ మెన్‌లకు ఎలాంటి శిక్షణలిస్తున్నారు?
అగ్నిమాపక కార్యాలయంలో విధుల్లో చేరే సమయంలో నాలుగు నెలలు శిక్షణ ఇస్తారు. స్విమ్మింగ్‌ శిక్షణ తర్వాత గోవా, బెంగళూరు, ఒరిస్సాలలో ప్రత్యేక శిక్షణకు పంపిస్తాం, నాగపూర్‌లో టైర్‌ ట్రైనింగ్‌ ఇస్తారు.
ఇరుకైన ప్రాంతాల్లో వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
ఇరుకైన ప్రదేశాలలో ప్రమాదాల జరిగినప్పుడు మెయిన్‌ రోడ్డుపైన అగ్నిమాపక వాహనం ఆపి ఒస్‌రీల్‌ ద్వారా ప్రమాదాలను అరికడతాం. బెస్ట్‌ బుల్లెట్‌ వాహనం కూడా వాడతాం. అవసరమైతే ఇంకా ఇరుకైన చోట మిస్‌ బులెట్‌ ఉపయోగించి ప్రమాదాలను అరకడతాం.
ప్రమాదలపై ప్రజలకు మీరిచ్చే సూచనలు, సలహాలు?
ప్రతి ఏడాది దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఏప్రిల్‌ 14 నుండి 21 వరకు ఫైర్‌ ఉత్సవాలు నిర్వహిస్తాం. ఒక రోజు ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలలు, పెట్రోల్‌ బంక్‌, గ్యాస్‌ గోడౌన్‌, ప్రభుత్వ కార్యాలయాలను ప్రజలు నివాసాల ప్రాంతాలలో అగ్నిప్రమాదాల నివారణ కోసం శిబిరాలు నిర్వహిస్తాం. ఒకవేళ అనుకోకుండా ప్రమాదాలు జరిగితే వాటిని ఎలా అరికట్టాలో స్థానికులకు వివరిస్తాం. ప్రమాదాలు సంభవించగానే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇస్తే వెంటనే స్పందించి ప్రమాదాల నివారణకు చర్య తీసుకుంటాం. ప్రజలు అగ్ని ప్రమాదాలు జరగకుండా బాధ్యతగా ప్రవర్తించాలి. జిల్లాలో సిబ్బంది,యంత్రాల కొరతలు లేవు.
రాబోయే వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చిన్న పిల్లలకు అగ్గిపెట్టలు, లైటర్లు, టపాసులు ఇతర మండలే పదార్థాలను అందుబాటులో ఉంచరాదు. కాల్చిన సిగరెట్‌, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా జాగ్రత్తగా పారవేయాలి. వంట గదిలో గాలి వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఎల్‌పిజి గ్యాస్‌ వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులెటర్‌ ఆఫ్‌ చేయాలి. గ్యాస్‌ లీక్‌ అవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేయాలి. వంట గదిలో కిరోసిన్‌, పెట్రోల్‌, అదనపు గ్యాస్‌ సిలిండర్‌ను ఉంచకూడదు.