ప్రజాశక్తి - ఓబుల దేవర చెరువు : రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర సమయాల్లో వైద్య సేవల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 108 వాహనం మరమ్మతులకు గురైంది. శ్రీ సత్య సాయి జిల్లా అమడుగూరు మండలానికి చెందిన 108 వాహనం నల్లమాడ మండలం వంకర కుంట గ్రామానికి చెందిన ఒక రోగిని కదిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తూ మార్గమధ్యంలో టైరు పగిలి ఆగిపోయింది. మరొక 108 వాహనాన్ని పుట్టపర్తి నుంచి రప్పించి రోగిని కదిరికి తరలించారు. ప్రస్తుతం అమడగూరు మండలానికి చెందిన 108 వాహనం ఓడి చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండిపోయింది. దీంతో ఓడి చెరువు, అమడగూరు మండలాలకు ఒకే వాహనాన్ని వినియోగించవలసిన పరిస్థితి నెలకొనడంతో ప్రజలు అత్యవసర సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబందిత అధికారులు స్పందించి 108 వాహనానికి కొత్త టైర్లు, ఇతర మరమ్మతులు పూర్తి చేసి, వాహనాన్ని వైద్య సేవలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.










