కడప అర్బన్ : ప్రస్తుతం ప్రైవేటు విద్యా సంస్థలు తమ విద్యా సంస్థల లో విద్యార్థులు చేర్చుకోవడానికి ప్రచారం తిరగడానికి,ప్రతి ఒక్కరికీ టార్గెట్లు పేరుతో అడ్మిషన్లు చేర్పించాలని ప్రైవేటు అధ్యాపకులను ఒత్తిడి చేయడాన్ని విరమించుకోవాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి వీరనాల.శివకుమార్ తెలిపారు. సోమవారం కలెక్టర్ స్పందనలో డిఆర్‌ఒకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో ఎండలు మండుతున్నాయి అన్నారు. ఈ సమయంలో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్న క్షణంలో ప్రయివేటు విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యాసంస్థలు ప్రచారం కోసం ఊరూరూ, వీధిó, వీధులు తిప్పుతూ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. రాకుంటే తర్వాత విద్యా సంవత్సరం తిరిగి తీసుకోమని బెదిరిస్తున్నారని చెప్పారు. బలవంతంగా ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. దీనిని యువజన సంఘం గా ఖండిస్తున్నామన్నారు. ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ, ప్రచార ఆర్భాటాలు యాజమాన్యాలు నిర్వహిస్తున్న జిల్లాలో విద్యా శాఖా అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారని విమర్శించారు. వారికి పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వారికి కనీస వేతన సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటి అమలు కోసం భవిష్యత్ లో ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల పై ఒత్తిడి, బలవంతపు ప్రచారాలను ఆపాలన్నారు. అలా నిర్వహిస్తున్న యాజమాన్యాల పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి డి.ఎం.ఓబులేసు పాల్గొన్నారు.










