ప్రజాశక్తి-నందిగామ : పురస్కారాలకు వాలంటీర్లు గైర్హాజరు కావటం పై నందిగామ ఎంఎల్ఎ మొండితోక జగన్మోహన్ రావు స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ మండలంలో గల ఎంపీడీఓ. కార్యాలయంలో ఏర్పాటుచేసిన వాలంటీర్ల సేవా పురస్కారాల కార్యక్రమంలో షెడ్యూల్లో పేర్కొన్న గ్రామాలకు సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు, వాలంటీర్ల గైర్హాజరుపై శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లు తాము తీసుకునే పురస్కారాలకు వారే గైర్హాజరు అవ్వటం ఏమిటని ఇది దేనికి సంకేతం అని అధికారులను ప్రశ్నించారు. ఈ విధంగా సేవ పురస్కారాలకు గైర్హాజరు అవ్వటం ఏమిటని సభకు హాజరైన పలు గ్రామాల సర్పంచులు,వాలంటీర్లను, శాసనసభ్యులు మొండితోక జగన్మోహనరావు నిలదీశారు. వాలంటీర్లు కొంతమంది గైర్హాజరు కావడంతో శాసనసభ్యుల సూచనల మేరకు సోమవారం జరగవలసిన వాలంటీర్ల సేవ పురస్కారాలు అధికారులు రేపటికి వాయిదా వేశారు. మరొకసారి ఈ విధంగా జరిగితే సహించేది లేదని శాసనసభ్యులు డాక్టర్.మొండితోక జగన్మోహనరావు అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ నెలకుదిటి శివ నాగేశ్వరరావు, ఎంపిపి అరిగెల సుందరమ్మ, పల్లగిరి సర్పంచ్ రవికిరణ్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.










