ప్రజాశక్తి-సోమందేపల్లి : మండల పరిధిలోని చాల్లాపల్లిలో సచివాలయ ఏర్పాటుకు స్థల సేకరణ విషయంలో అధికారుల తీరుకు ఆ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళకు దిగారు. తహశీల్దార్ కార్యాలయంలో కింద కూర్చొని నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సర్పంచికి తెలపకుండా రెవెన్యూ సిబ్బంది, మండల సర్వేయర్ వచ్చి గ్రామంలో ఎలాంటి ఆధారం లేని అనాధ మహిళ స్థలంలో సచివాలయ భవన నిర్మాణానికి కొలతల వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామకంఠం భూమిలో సచివాలయం ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరినా అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోలేదన్నారు. గ్రామ కంఠం భూమిని ఒక ప్రతిపక్ష నాయకుడు ఆక్రమించుకున్నాడని ప్రజా ఉపయోగాలకు ఉపయోగించాల్సిన ఆ భూమిని కాపాడవలసిన రెవిన్యూ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు సర్పంచి భర్త దామోదర్, ఉపసర్పంచ్ కె నరేష్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, బాబి రెడ్డి, గంగాధరప్ప, శ్రీనివాసులు, రవీందర్ రెడ్డి, అంజన రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










