Dec 20,2022 09:33

పురుగుల మందు తాగి పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో అపస్మారక స్థితిలో పడిపోయిన రైతు రామయ్య యాదవ్‌

           పెనుకొండ : పరిశ్రమ ఏర్పాటు పేరుతో అక్రమంగా తన భూమిని లాక్కోకుండా కోర్టు తీర్పు మేరకు తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ రైతు అధికారుల సాక్షిగా ప్రభుత్వ కార్యాలయంలో ఆత్మహత్యకు యత్నించాడు. పెనుకొండ సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. బాధిత రైతు కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం కావేటినాగేపల్లికి చెందిన రైతు రామయ్య యాదవ్‌కు 3.50 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఇందులో పంటలు సాగు చేసుకుంటూ ఆయన జీవనం సాగిస్తున్నాడు. ఈ ప్రాంతంలో నాసన్‌ కంపెనీ ఏర్పాటు పేరుతో న్యాయమైన పరిహారం కూడా ఇవ్వకుండానే ఈ రైతు భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేసింది. దీంతో బాధిత రైతు హైకోర్టును ఆశ్రయించాడు. రైతుకు న్యాయం చేసిన తరువాతనే భూసేకరణ చేయాలని హైకోర్టు జిల్లా అధికారులను ఆదేశించింది. అయితే అధికారులు హైకోర్టు తీర్పును లెక్కజేయకుండా నెల రోజుల క్రితం అక్రమంగా జొరబడి రైతు పొలం చుట్టూ ఇనుప కంచె వేశారు. అక్కడున్న రైతు ఇంటినీ కూల్చివేశారు. ఈ సమస్యపై బాధిత రైతు కుటుంబం తమకు న్యాయం చేయాలని అని కోరుతూ గత కొన్ని నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతునే ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో అర్జీ ఇచ్చేందుకు రైతు రామయ్య యాదవ్‌ వచ్చాడు. అధికారుల మాటలు విన్న అతనికి వారు న్యాయం చేయరని అన్పించింది. అప్పటికే తనతో తెచ్చుకున్న పురుగుల మందును అధికారులు, పోలీసుల ఎదుటే తాగేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పురుగుల మందు డబ్బాను పక్కకు లాగేసి రైతును చికిత్స నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ప్రస్తుతం రైతుకు వైద్యుల పర్యవేణలో చికిత్సలు చేస్తున్నారు.
రైతుకు న్యాయం చేయాలని సిపిఎం ధర్నా
రైతు రామయ్య యాదవ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ముందు సోమవారం మధ్యాహ్నం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పెనుకొండ, సోమందేపల్లి మండల కార్యదర్శులు రమేష్‌, రాజగోపాల్‌ మాట్లాడుతూ రైతుకు న్యాయం చేసిన తరువాతనే భూమిని తీసుకోవాలని హైకోర్టు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడం దుర్మార్గం అన్నారు. అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. నాసిన్‌ నిర్మాణ పనులు అక్రమంగా, దౌర్జన్యంగా చేపడుతున్నారని రైతులు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోని పరిస్థితి ఉందన్నారు. సబ్‌ కలెక్టర్‌పై దీనిపై స్పందించి బాధిత రైతుకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గంగాధర్‌, వెంకటరాముడు, ఆవాజ్‌ కమిటీ నాయకులు చాంద్‌బాషా, మాబు, చేనేత కార్మిక సంఘం నాయకులు గంగరాజు, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.