Dec 17,2022 21:27

వైసిపి నేతల విభేదాలు

       అనంతపురం ప్రతినిధి : అధికార వైసిపిలో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. నియోజకవర్గ సమన్వయ సమావేశాల్లో బాహాటంగానే అసంతృప్తిని నేతలు, క్యాకర్తలు వెల్లగక్కుతున్నాయి. వీటిని సమన్వయం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశాల్లోనూ సమన్వయం కుదిర్చే యత్నాలు ఫలించడం లేదు. ఈ నేతలొద్దంటూ బాహాటంగానే రాయలసీమ సమన్వకర్త పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదుటే తెగేసి చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులకు టికెట్లు వద్దంటే వద్దని నినాదాలు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వైసిపి నియోజకవర్గ సమన్వ సమావేశాల్లో ఆ పార్టీలో నెలకొన్న అసమ్మతిని బట్టబయలు చేస్తోంది.
       వైసిపి నియోజకవర్గ సమన్వయ సమీక్షా సమావేశాల పేరుతో ఈ నెల ప్రారంభం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ స్థాయిలో సమావేశాలను నిర్వహించలేదు. సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే పనిలో భాగంగా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించే పనిని రాయలసీమ పార్టీ సమన్వయకర్తగానున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టారు. ఇందలో ఎక్కడైనా నాయకుల మధ్య సమన్వయ సమస్యలు వెలుగులోకి వస్తే వాటిని సరిచేసే ఉద్ధేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టారు. ఇప్పటికే అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం పూర్తి సమీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సమావేశాలు జరుగుతున్నాయి. అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లో అధికంగానే అసంతృప్తిలు వెల్లడయ్యాయి. అయితే వాటిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొంత వరకు సర్ధిజెప్పే ప్రయత్నాలు చేసి సఫలీకృతమయ్యారు. హిందూపురం పార్టీమెంట్‌ పరిధిలో చూసినప్పుడు మడకశిర, పెనుకొండ, హిందూపురం నియోజకవర్గాల్లో అసమ్మతి సెగ తారా స్థాయికే చేరాయని చెప్పవచ్చు. మడకశిరలో సర్ధిజెప్పేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నించినా అసమ్మతి నాయకులు, కార్యకర్తలు వినలేదు. ఎమ్మెల్యే తిప్పేస్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇటువంటి నాయకుడు తమకొద్దంటూ నిరసనలు తెలిపరు. తాజాగా శనివారం నాడు పెనుకొండ నియోజకవర్గ సమన్వయ సమావేశంలోనూ ఇదే తరహా నిరసన కన్పించింది. 'జగనన్న ముద్దు...శంకరనారాయణ వద్దు' అంటూ అసమ్మతి నేదలు పెద్దిరెడ్డి ఎదుట నినాదాలు చేశారు. మరోవైపు శంకరనారాయణ మద్దతుదారులు ఆయనకు అనుకూలంగా నినాదాలు చేయడంతో పెనుకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో కొందరు అసమ్మతి నేతలు చెప్పులు చూపించడంతో ఇది మరింత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పోలీసులు మంత్రి పెద్దిరెడ్డిని మరో మార్గంలో సమావేశ ప్రాంతానికి పంపించారు. ఇలా వైసిపి నేతలు, కార్యకర్తల మధ్య విభేదాలు రచ్చకెక్కుతుండటంతో ఇద్దరి మధ్య సమన్వయ కుదర్చడం పెద్ద సవాల్‌గానే మారింది. ఒకవైపు శంకరనారాయణ సత్యసాయి జిల్లా అధ్యక్షులుగానూ ఉన్నారు. ఆయన నియోజకవర్గంలోనే సొంత పార్టీ నుంచే అసంతృప్తులు ఈ రకంగా వ్యక్తమవుతుంటే... ఇతర ప్రాంతాల్లోనున్న సమస్యలను ఏ రకంగా సమన్వయం చేయగలరన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో సాగుతున్న చర్చ. కొన్ని చోట్ల బాహాటంగా అసంతృప్తులు బయటకు వస్తుండగా, మరికొన్ని చోట్ల తాత్కాలికంగా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో అసంతృప్త జ్వాలలు రాబోయే ఎన్నికల నాటికి ఏ రకంగా మలుపులు తిరుగుతాయన్నది వేచి చూడాల్సి ఉంది.