అధిక ధరలతో పేదల అవస్థలు
ప్రజాశక్తి-ఎఎస్‌పేట : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేస్తూ దేశ సంపదని అదానీకి కట్టబెడుతున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి అన్నారు. ఆదివారం మండల కేంద్రమైన అనుమసముద్రంపేట గ్రామంలో దర్గావీధి పలు ప్రాంతాలలో మండల నాయకులు ఆధ్వర్యంలో ప్రచారభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచిన నిత్యావసర సరుకులు, కూరగాయలు పెట్రోల్, డీజిల్ కరెంట్ ఛార్జీలు ఇలా అనేక రకాల వాటిపై ధరల విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరలను నియంత్రించవలసిందిగా వారు డిమాండ్ చేశారు. అనంతరం ప్రజలకు వ్యాపారస్తులకు కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అస్లాం, సిఐటియు మండల కార్యదర్శి గయాజ్, ఆవాజ్ మండల కార్యదర్శి నిస్సార్, తదితరులు పాల్గొన్నారు.










