ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటరు కార్డును ఆధార్ నెంబరుకు లింక్ చేసుకోవాలని, అందుకు 6-బి ఫారమ్ సమర్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు.సోమవారం స్పందన సమావేశపు హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సిఎస్‌ఓలతో ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి డిసెంబర్ వరకు ఓటరు కార్డుతో ఆధార్ కార్డును లింక్ చేసే కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. అందుకు అధికారులు ఇంటింటికి వచ్చి 6-బి ఫారమ్ ద్వారా మ్యానువల్గా లింక్ చేస్తారన్నారు. ఆధార్ కార్డు లేనివారు జాతీయ ఉపాధి హామీ. కార్డు, ఫోటో కలిగిన బ్యాంక్ పాస్ బుక్, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, ఆర్ ఐ వారి స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కార్డు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చే అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర ప్రభుత్వం జారీచేసే యూనిక్ ఐడెంటిటీ కార్డు వంటివి సమర్పించ వచ్చన్నారు. గతంలో జనవరి 5న సంత్సరానికి ఒకసారి మాత్రమే ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించే వారమని, భారత ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ఇకపై జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1 మరియు అక్టోబర్ 1న ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లాలో 14,89,563 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 7,27,595 మంది పురుషులు, 7,61,878 మంది మహిళలు, ఇతరులు 90 మంది ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, సీపీఐ, టిడిపి రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.










