- సమావేశం జరిగి రెండేళ్లు
- సంక్షోభ సమయాన రైతుకు కొరవడిన దశ, దిశ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతులు నిరంతరం ఎదుర్కొనే సమస్యలపై చర్చించి ఎప్పటికప్పుడు కార్యాచరణ రూపొందించే బృహత్తర లక్ష్యంతో ఏర్పాటైన రాష్ట్ర వ్యవసాయ మిషన్ అడ్రస్ లేకుండా పోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా వేసిన మిషన్ కనీసం సమావేశాలకూ నోచుకోవట్లేదు. మిషన్ చివరి భేటీ 2020 జనవరిలో నిర్వహించారు. సమావేశం జరిగి రెండేళ్లు దాటిపోయింది. అసలు మిషన్ ఉనికిలో ఉందో లేదో కూడా అనుమానమే. కోవిడ్ ఆపత్కాలంలో మార్కెట్ సౌకర్యాలు అస్తవ్యస్థమై రైతులు తీవ్ర అవస్థల పాలవగా సరిగ్గా ఇప్పుడే వ్యవసాయ మిషన్ కార్యకలాపాలు పూర్తిగా పడకేశాయి. ఈ కాలంలో వ్యవసాయంపై సాధారణ స్థాయి సమీక్షా సమావేశాలు మినహా అగ్రి మిషన్‌ను సమావేశ పర్చలేదని విమర్శలొస్తున్నాయి.
తొలుత ఆశాజనకం
టిడిపి ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన వైసిపి ప్రభుత్వం, ఆ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసమంటూ వ్యవసాయ మిషన్‌ను అధికారంలోకి రాగానే 2019 జులైలో నెలకొల్పింది. ముఖ్యమంత్రే మిషన్‌కు ఛైర్మన్ కావడం, సంబంధిత మంత్రులను, ఉన్నతాధికారులను, నిపుణులను, రైతు, వ్యాపార ప్రతినిధులను సభ్యులుగా వేయడంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురించాయి. విధిగా నెలకోసారి సిఎం అధ్యక్షతన మిషన్ భేటీ ఉంటుందని ఉత్తర్వుల్లో సైతం పేర్కొన్నారు. మిషన్‌ను నెలకొల్పిన తొలినాళ్లలో భేటీలు జరగ్గా, తర్వాత్తర్వాత మొక్కుబడిగా మారాయి.
రైతు చిత్తయినా...
కరోనా పరిస్థితులు, డీజిల్, పెట్రోలు ధరల బాదుడు వలన సాగు ఖర్చులు పెరిగాయి. రైతులు పండించిన ఏ పంటకూ ధర లేదు. విపత్తులు వెంటాడి రైతులను భారీగా నష్టపర్చాయి. ధాన్యం, పత్తి, మిర్చి, బత్తాయి, ఉల్లి, టమాటా, పసుపు రైతుల బాధలు చెప్పనలవి కాదు. ప్రభుత్వ సంస్థల కొనుగోళ్లు, మార్కెట్‌లో జోక్యం అస్తుపిస్తే. పంట వేసే ముందే ధరల నిర్ణయం, మార్కెట్ ఇంటెలిజెన్స్, అందుకనుగుణంగా పంటల సరళిలో మార్పులు, అధ్యయనాలు, చర్చలు, వ్యూహాత్మక పత్రాల రూపకల్పనకు వేసిన అగ్రి మిషన్ పత్తా లేకుండా పోయింది. రాష్ట్ర స్థాయి మిషన్ భేటీలే లేనందున జిల్లా స్థాయి మిషన్ సమావేశాలూ లేవు. వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్‌గా నియమితులైన ఎంవిఎస్ నాగిరెడ్డి కార్యాలయానికి సచివాలయంలో ఒక గది కేటాయించారంతే. సిబ్బంది, మౌలిక సదుపాయాలు నామమాత్రం. మిషన్‌ను ప్రతి నెలా సమావేశపర్చాల్సింది ఉపాధ్యక్షులే. ఆయనే ఎజెండా రూపొందించాలి. వ్యవసాయ మిషన్ అనడంతో ఇరిగేషన్, పశుసంవర్ధక, ఇత్యాది అనుబంధ శాఖలు పట్టించుకోవట్లేదు. దాంతో సాధికారత తెచ్చేందుకు వ్యవసాయ మిషన్ పేరును రైతు మిషన్‌గా మార్చాలని నాగిరెడ్డి ప్రభుత్వానికి, సిఎంకు లేఖలు రాశారు. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాగిరెడ్డి ప్రజాశక్తితో మాట్లాడుతూ కొన్ని అనివార్య కారణాల వలన మిషన్ సమావేశం జరగలేదన్నారు. ఇదిలా ఉండగా మొన్నటి మంత్రివర్గ విస్తరణలో మిషన్‌లో సభ్యులైన మంత్రులందరూ మారారు. చాలా మంది అధికారులూ మారారు. ఇప్పుడొచ్చిన వారికి అసలు మిషన్‌పై అవగాహనే లేదంటున్నారు.










