Mar 02,2023 19:22

సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్‌ రమేష్‌రెడ్డి

ప్రజాశక్తి-పీలేరు : ఆడబిడ్డ జన్మించేది సంపూర్ణంగా జీవించడానికేనని, వారి విద్య, ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్‌ రమేష్‌రెడ్డి తెలిపారు. గురువారం పీలేరు ఎపి గురుకుల బాలికల ఉన్నత పాఠశాలలో 'ఆడశిశువును కాపాడుదాం-సృష్టిని రక్షిద్దాం' అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడబిడ్డ సంక్షేమం దృష్ట్యా 1 నుండి 8వ తేదీ వరకు జరిగే ప్రత్వేక కార్యక్రమాల్లో గర్భస్థ పిండం ఆడబిడ్డ అని తెలియగనే గర్భస్థ హత్యకు పాల్పడ్డం కేవలం ఆ కుటుంభానికే కాకుండా సమాజ మొత్తానికీ తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. నేడు బాలిక సంక్షేమం, ఆరోగ్యం, విద్య, సామాజిక అంశాలపై సంపూర్ణంగా అవగాహన పొందాల్సిన అవసరం అందరికీ ఉందని, ఇది ప్రతి ఆడబిడ్డ నైతిక బాధ్యతని చెప్పారు. సమాజములో నేడు జరుగుతున్న మంచి, చెడు సమ్మేళనం నుంచి మంచిని గ్రహించి మసలుకునే నైపుణ్యం ప్రతి ఆడబిడ్డకూ అవసరమని తెలియజేశారు. అందుకు మంచి ఆరోగ్యం, సమయస్ఫూర్తి, కష్టంతో కాకుండా ఇష్టపడి చదివే నైపుణ్యం, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆతృత, క్రమశిక్షణ కచ్చితంగా కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు మనం ఆడపిల్లను వద్దనుకుంటే రేపు మన సమాజం అమ్మలేని అనాథ అవుతుందని, విజ్ఞానం అందరి వంతు కావాలని, ఇటు సమాజానికి, అటు కుటుంబానికీ బాలిక ఒక ఆణిముత్యమన్నారు. ప్రతి ఒక్కరం కుటుంబ, సమాజ శ్రేయస్సు, దేశ భవిష్యత్తు దృష్ట్యా ఆడబిడ్డను పుట్టనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, గౌరవిద్దామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కొండయ్య, ప్రిన్సిపల్‌ పిహెచ్‌ఎన్‌ వెంకటసుబ్బమ్మ, పర్యవేక్షకులు కృష్ణయ్య, అక్కయ్య, ఎఎన్‌ఎం పామున్నీసా, సిహెచ్‌ఒ లావణ్య, ఆశ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.