Jan 22,2023 20:48

..జిఎన్‌ఎస్‌ఎస్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం.మల్లికార్జునరెడ్డి

రూ.12.10 కోట్లతో లీకేజీ పనులకు ప్రతిపాదనలు
 80 జికెఎల్‌ఐ డ్రిప్‌ ఇరిగేషన్‌ సంపుల నిర్మాణం ..జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని ప్రాజెక్టుల్లో 48 టిఎంసిలు నిల్వ
..జిఎన్‌ఎస్‌ఎస్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ ఎం.మల్లికార్జునరెడ్డి                                                                                                                -కడపప్రతినిధి
ఉమ్మడి జిల్లాలోని 15 సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో అదనపు ఆయకట్టును సాగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. రూ.400 కోట్లతో మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల్లోని చిన్న, మధ్యతరహా, భారీ సాగు నీటి ప్రాజెక్టుల పరిధిలో తక్కువ వ్యయంతో కూడిన డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలపై దృష్టి సారించాం. జికెఎల్‌ఐ పరిధిలోని డ్రిప్‌ ఇరిగేషన్‌ పనుల్లో భాగంగా చేపట్టిన 900 సంపుల్లో 82 సంపుల నిర్మాణ పనుల పూర్తి చేశాం. అనంతరం ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్దదైన మొగమేరు అక్విడక్ట్‌ను పూర్తి చేయడంపై దృష్టి సారించామని గాలేరు- నగరి సుజల స్రవంతి పథకం సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ ఎం. మల్లికార్జునరెడ్డిని ప్రజాశక్తి కలిసిన సందర్భంగా ముఖాముఖి. ...
ఉమ్మడి జిల్లాలోని అదనపు ఆయకట్టు వివరాలు తెలపండి?
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు ఎనిమిది లక్షల ఎకరాల ఆయ కట్టు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రప్రభుత్వం తక్కువ సమయంలో అత్యధికంగా అదనపు ఆయకట్టుకు నీరందించడంపై దృష్టి సారించింది. ఇందులోభాగంగా 2023 డిసెంబర్‌ నాటికి జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధి లోని సర్వరాయసాగర్‌, వామికొండ ప్రాజెక్టుల పరిధిలోని 35 వేల ఎకరా లకు సాగునీటిని అందించే దిశగా దృష్టి సారించింది.
జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టుల వివరాలు?
జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలో ఆరు చిన్న, మధ్యతరహా, భారీ సాగు నీటి ప్రాజెక్టులున్నాయి. ఇందులో ఒకటి భారీ, ఐదు మధ్య తరహా ప్రాజెక్టులున్నాయి. గండికోట, వామికొండ, సర్వరాయసాగర్‌, పైడి పాలెం, మైలవరం, సిబిఆర్‌ ప్రాజెక్టులున్నాయి.
ప్రాజెక్టుల నీటి నిల్వ పరిమాణమెంత?
జిఎన్‌ఎస్‌ఎస్‌ సాగునీటి ప్రాజెక్టులు 54.489 టిఎంసిల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రస్తుతం 48 టిఎంసిలు నిల్వ ఉన్నాయి.
డిస్ట్రిబ్యూటరీ పనుల వివరాలు తెలపండి?
జిఎన్‌ఎస్‌ఎస్‌ పరిధిలో ఫేజ్‌-2లోని ప్యాకేజీ-1, ప్యాకేజీ -2, ప్యాకేజీ-3 పరిధిలోని గండికోట, సర్వరాయసాగర్‌, వామికొండ తదితర రిజర్వాయర్ల పరిధిలో 372 కిలోమీటర్ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ పనులకు రూ.400 కోట్ల వ్యయంతో మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని టెయి లెండ్‌ వరకు నీటిని అందించే అవకాశం ఉంది.
డిస్ట్రిబ్యూటరీల ద్వారా అదనపు ఆయకట్టు గురించి మాట్లాడండి?
జిఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ నిర్మాణా లకు రూ.200 నుంచి రూ.400 కోట్లు విడుదల చేస్తే జిల్లాలోని ఆరు లక్షల ఎకరాల్లో మూడు లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీటిని అందిస్తాం. ఇందులో పులివెందుల నియోజకవర్గ పరిధిలోనే 1.66 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీల ద్వారా సాగునీరు అందించే అవకాశం ఉంది. మిగిలిన తెలుగుంగ ప్రాజెక్టుల పరిధిలో అదనపు ఆయకట్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. పులివెందుల పరిధిలోని 1.65 లక్షల ఎకరాల్లో 1.25 లక్షల ఎకరాలు మైక్రో ఇరిగేషన్‌ కింద అందుబాటులోకి వస్తుంది. ఈమేరకు ప్రాజెక్టుల వారీగా డిస్ట్రిబ్యూటరీ నిర్మాణ పనులపై సర్వే చేపట్టాల్సి ఉంది.
ఫేజ్‌-2లోని నాలుగవ ప్యాకేజీ గురించి వివరించండి?
జిఎన్‌ఎస్‌ఎస్‌ ఫేజ్‌-2లోని నాలుగో ప్యాకేజీకి ఫారెస్టు సమస్య ఎదురవుతోంది.119 కిలోమీటర్‌ నుంచి 240 కిలోమీటర్‌ వరకు నాలుగో ప్యాకేజీ ఉంటోంది. ఇందుకు 2500-2800 ఎక రాలను సేకరించాల్సి ఉంది. ఇందుకుగానూ రూ.2,550 కోట్లు ఫారెస్టు డిపార్టుమెంట్‌కు చెల్లించాల్సి ఉంది.
సర్వరాయసాగర్‌ లీకేజీ పనుల సంగతేమిటి?
రూ.212 కోట్లతో సర్వరాయసాగర్‌ ప్రాజెక్టు పనులకు టెండర్లు పిలిచాం. ఇందులో లీకేజీ పనులకు సంబంధించి రూ.5.50 కోట్లు, వామి కొండ కింద రూ.6.6 కోట్ల వ్యయంతో కూడిన ప్రతి పాదనలు పంపించడమైంది. పాలనామోదం లభించింది. టెండర్లు పిలవడమే ఆల స్యం. రిజర్వాయర్‌ కట్ట కిందిభాగంలో నీటి లీకేజీ గురించి నీటి లీకేజీని అరి కట్టడానికి అత్యాధునిక సాంకేతికతో గ్రౌటింగ్‌ పనులు చేపట్టాల్సిన అవసరం ఉంది.
మైక్రో ఇరిగేషన్‌ పనుల తీరుతెన్నుల గురించి వివరించండి?
రూ.1260 కోట్లతో డ్రిప్‌ ఇరిగేషన్‌ చేపట్టడమైంది. జికె ఎల్‌ఐ పరిధిలోని 800 సంపుల్లో ఇప్పటికి 120 సంపులు పూర్తి చేయడమైంది. మిగిలిన నిర్మాణాలను పూర్తి చేయడంపై దృష్టి సారించాం. ఎల్‌ఎ సంబంధించిన సమస్య కొనసాగుతున్నందున ఆలస్యంగా సాగుతోంది. ఏదేమైనప్పటికీ సాధ్యమైన మేరకు త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రాధా న్యత ఇచ్చాం.
మైలవరం రిజర్వాయర్ల కట్టల పునరుద్ధరణ ఎప్పుడో?
గతేడాది నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో కురిసిన అధిక వర్షాలు ధాటికి పోటెత్తిన వరదల కారణంగా మైలవరం, చిత్రావతి రిజర్వాయర్ల కట్టలు కుంగిన మాట వాస్తవమే. వీటి పునరుద్ధరణకు సంబందించి ప్రతిపాదనలు సిద్ధం చేశాం. మైలవరం మరమ్మతులకు రూ.83 కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. రాష్ట్రప్రభుత్వం నుంచి ఆమోదం లభించడమే ఆలస్యం.
కాలేటివాగు ప్రాజెక్టు పురోగతిని వివరించండి?
2023 మే నాటికి కాలేటివాగు పనుల్ని పూర్తి చేస్తాం. పిఎల్‌ఆర్‌ కాంట్రాక్టు సంస్థ రూ.50030 కోట్లతో టెండరును దక్కించుకుంది. రూ.4,300 కోట్ల పనుల్లో ఇప్పటి వరకు 20 శాతం పనులు చేపట్టింది. కడప జిల్లాలో 40 వేలు, అన్నమయ్య జిల్లాలో లక్ష ఎకరాలు, చిత్తూరు జిల్లాల్లో 1.50 లక్షల ఎకరాలు వెరసి 2.90 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి రానుంది.
చిత్రావతి-ఎర్రబల్లి ఎత్తిపోతల పనుల పురోగతి తెలపండి?
రూ.850 కోట్లతో చిత్రావతి- ఎర్రబలి ఎత్తిపోతల పనులు చేపట్టాం. రెండు టిఎంసిల నీటిని ఎత్తిపోతల ద్వారా పంపింగ్‌ చేయాల్సి ఉంది. ఇందులో వేముల, వేంపల్లి ప్రాంతాల్లోని ఆరు చెరువులను నిం పాల్సి ఉంది. అనంతరం వేంపల్లిలోని గిడ్డంగివారి పల్లి చెరువును నీటిని సరఫరా చేయడం ద్వారా 10 వేల ఎకరాల అదనపు ఆయకట్టు లభించే అవకాశం ఉంది. ఎర్రబల్లి ఎత్తిపోతల పనుల వల్ల యుసిఐఎల్‌ పరిధిలోని ఆరు నిర్వాసిత గ్రామాలకు శుద్ధ జలాన్ని అందిస్తాం.
రాయలసీమ డ్రౌట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు పురోగతి ఎలా ఉంది?
రాయలసీమ డ్రౌట్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు పనుల్ని వేగవంతం చేశాం. సుమారు రూ.ఎనిమిది వేల కోట్లతో పనుల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఉమ్మడి కడప జిల్లాలో రూ.500 కోట్లతో జిఎన్‌ఎస్‌ఎస్‌ మెయిన్‌ కెనాల్‌ విస్తరణ, రూ.650 కోట్లతో గండికోట లిఫ్టు స్కీమ్‌ పను లతోపాటు మరో రూ.350 కోట్లతో ఇతర పనుల్ని చేపట్టడం జరిగింది. ఈలెక్కన ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 75 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు నీరందించే అవకాశం ఉంది.