Jul 14,2021 17:04

న్యూఢిల్లీ : ఎపి రాజధాని అంశంపై సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన సమాచారం తప్పని కేంద్ర హోంశాఖ వివరణ ఇచ్చింది. ఎపిలో మూడు రాజధానుల అంశంపై సమాచారాన్ని కోరుతూ.. చైతన్యకుమార్‌రెడ్డి అనే వ్యక్తి గతంలో కేంద్ర హోంశాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తుకు కేంద్ర హోంశాఖ సిపిఐఒ రేణు సరిన్‌ ఈ నెల 6న సమాచారం ఇచ్చారు. ఎపి ప్రభుత్వం వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం-2020 ప్రకారం రాష్ట్రంలో మూడు పరిపాలన కేంద్రాలుంటాయని, వాటిని రాజధానులు అంటారని, రాష్ట్ర రాజధాని అంశాన్ని ఆ రాష్ట్రమే నిర్ణయించుకుంటుందని అందులో పేర్కొన్నారు. దీనిపై అమరావతి జెఎసి చైౖర్మన్‌ ప్రొఫెసర్‌ జివిఆర్‌ శాస్త్రి అభ్యంతరం చెబుతూ కేంద్ర హోంశాఖ అప్పిలేట్‌ అథారిటీ అయిన సంయుక్త కార్యదర్శి ప్రకాష్‌కు ఈనెల 9న లేఖ రాశారు. ఈ చట్టం ఇంకా అమల్లోకి రాలేదని, రాజధాని అంశం హైకోర్టులో ఉందని ఆ లేఖలో పేర్కొన్నారు. దీనికి ప్రకాష్‌ బదులిస్తూ.. క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్రం తరఫున సిపిఐఒ తప్పుడు సమాచారమిచ్చారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఎపి రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉందంటూ రేణు సరిన్‌ సవరించిన సమాధానం ఇచ్చారు.