అక్కడికి చేరుకుంటున్న జనం నెలల పాటు సరిపోయే ఆహారధాన్యాలను వెంట తెచ్చుకొని పొయ్యి ఆర్పకుండా వంటలు చేస్తూనే వున్నారు. అక్కడికి ఎవరు వచ్చినా తిండి పెట్టకుండా పంపరు. వంట మనుషులు ఉండరు. అందరూ వంట చేయాల్సిందే. చూడడానికి పోయిన వారు కూడా తమకు కావాల్సింది వడ్డించుకొని తినవచ్చు. చివరకు ఈ ఉద్యమాన్ని అణచడానికి వచ్చిన సైనికులకు కూడా వీరే భోజనం పెడుతున్నారంటే మానవత్వం ఎలా వెల్లివిరుస్తోందో తెలుస్తుంది. ఆడ, మగ తేడా లేదు. కులం లేదు. మతం లేదు. ఒక్కటే నినాదం. 'హమ్ ఏక్ హై. నరేంద్ర మోడీ చోర్ హై'.
ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతు పోరాటాన్ని కళ్ళారా చూద్దామని ఉభయ తెలుగు రాష్ట్రాల రైతు, కార్మిక, వ్యవసాయ కార్మిక నాయకుల బృందంతో కలిసి ఢిల్లీ - సింగు సరిహద్దు ప్రాంతానికి వెళ్లాం. ఢిల్లీలో నివాసం ఉంటున్న వారు, గత మూడు రోజుల క్రితం ఆ పోరాటాన్ని చూసి వచ్చినవారు తిరిగి మా బృందంతో వచ్చారు. ఇంతకుమునుపు వచ్చినవారు ఆ ప్రాంతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఏంటని ప్రశ్నిస్తే 'మేం వచ్చిన రోజు ఈ రోడ్డు మొత్తం ఖాళీగా వుంది. మూడు రోజులు తరువాత చూస్తే ఢిల్లీ వైపు మరో రెండు కి.మీ వరకు జనం ముందుకొచ్చారు. ఏ పోరాటమైనా ప్రారంభించిన నాటికి మరసటి రోజుకి సన్నగిల్లుతుంది. కానీ ఈ పోరాటంలో రోజు రోజుకు వేలమంది వచ్చి చేరుతున్నార'న్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతాంగ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ బిల్లు 2020 వెనక్కి తీసుకోవాలని, కనీస మద్దతు ధరలను చట్టబద్దం చేయాలని...వందల మందితో ప్రారంభమైన ఉద్యమం నేడు దేశ వ్యాపిత ఉద్యమంగా మారింది. ఇప్పటికే 35 మంది బలి అయ్యారు. అయినా రైతులు వెనుకంజవేయలేదు. గజగజ వణికించే చలిలో కిలోమీటర్ల పాటు గుడారాలే కనిపిస్తాయి. రోడ్ల పైనే స్నానాలు, దట్టమైన మంచులో చలి మంట వేసుకొని చుట్టూ కూర్చున్న వృద్ధులు, మహిళలు, పసిపిల్లలు...మాలాంటి కొత్త తరానికి స్ఫూర్తినందిస్తున్నారు. పోరాట పటిమను నేర్పుతున్నారు. వారిలో ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట. 'మోడీ సర్కారు వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు తిరిగి మా ఊర్లకు వెళ్ళం' అనే మాట తప్ప మరో మాట లేదు.
ఇది మహా యుద్ధమే
స్వాతంత్య్రానంతరం ఇన్ని రోజులపాటు ఇన్ని లక్షల మంది దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టి పాలక వర్గాల వెన్నులో వణుకు పుట్టించిన మొట్టమొదటి పోరాటం ఇదే. సెంటిమెంటుతో ప్రజలను చల్లబర్చడానికి ఏకంగా ప్రధానమంత్రే ఎటువంటి రక్షణ లేకుండా గురుద్వారా వెళ్ళి ప్రార్ధనలు చేశారంటేనే ఈ ప్రభుత్వానికి ఎంత భయం పట్టుకుందో తెలుస్తుంది.
విశాల మద్దతు
ఈ పోరాటం ప్రత్యేకమైనది. దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరి పదవీ విరమణ పొందిన వీర జవానులు, సైనికాధికారులు సైతం ఈ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. ఢిల్లీ, చుట్టుపక్క రాష్ట్రాల ప్రజలు, డాక్టర్లు మొదలుకొని వ్యవసాయ కూలీల వరకు వీరికి సేవలందిస్తున్నారు. డిగ్రీ, పిజీ చదువుకుంటున్న వందలాది మంది విద్యార్థులు ఎక్స్‌కర్షన్‌కు వచ్చినట్లు వచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు వీరికి సేవలు చేసి వెళుతున్నారు. చిరు వ్యాపారస్తులు దుప్పట్లు, చాపలు, బెడ్లు, వేసుకోవడానికి టార్పాలిన్లు, మంచినీళ్ళ ట్యాంక్‌లు, వాటర్ బాటిళ్ళు, వంట పాత్రలు చివరకు సబ్బులు, బ్రష్షులు, పేస్ట్‌లు సైతం ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అందిస్తున్నారు. అదే విధంగా సరిహద్దుల్లో వీర జవాన్ల కుటుంబాలు పోరాటంలో వుంటే తాము సెలవు పెట్టి వచ్చి వ్యవసాయం, ఇళ్ళ దగ్గర అలన పాలన చూస్తున్నారు. దేశంలో అనేకమంది ప్రభుత్వం ఇచ్చిన గౌరవ పతకాలను సైతం వెనక్కి ఇస్తున్నారు.
నిర్బంధాన్ని అధిగమించి...
నవంబర్ 25న నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతాంగం చలో ఢిల్లీకి పిలుపునిచ్చింది. బిజెపి ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణచడానికి తీవ్రమైన నిర్బంధం ప్రయోగించింది. ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది. వారు కేంద్రం కనుసన్నల్లో ఇనుప కంచెలు వేశారు. బారికేడ్లు నిర్మించారు. నీటి ఫిరంగులు ప్రయోగించారు. బాష్పవాయువు ప్రయోగించారు. వాహనాలు రానివ్వకుండా కందకాలు తవ్వారు. బండరాళ్ళు అడ్డంగా వేశారు. చివరకు ఈ ఘోరాన్ని ప్రపంచానికి తెలియజేయనీయకుండా మీడియాను నిషేధించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా లక్షలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టారు. ఘజీపూర్, టెక్రీ, సింగు, నోయిడా, పల్వల్ ప్రాంతాలలో సుమారు 60 కి.మీ పొడవున లక్షలాది మంది రైతాంగం బైఠాయించి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించారు.
కార్మిక, కర్షక మైత్రి
రైతాంగం చేస్తున్న పోరాటానికి దేశంలోని కార్మిక వర్గం అండగా నిలుస్త్తోంది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం పోరాడుతుంటే దేశ వ్యాపితంగా అన్ని రంగాల కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, ఉద్యోగులు, యువజన, విద్యార్థులు వారికి మద్దతుగా పోరాడుతున్నారు. జోలెె పట్టి నిధులు సేకరించి ఆ ఉద్యమానికి పంపుతున్నారు. ఈ దేశంలో పెట్టుబడిదార్లు, కార్పొరేట్ల కబందహస్తాల్లో నలిగిపోయే ప్రతి పౌరుడు పోరాటంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మద్దతిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాపితంగా జోలె పట్టి లక్ష రూపాయలు సేకరించి ఈ ఉద్యమానికి పంపింది.
భోజనాలు.. సౌకర్యాలు..
మనం వందల మందికి భోజనం పెట్టడానికి, తొక్కిసలాట లేకుండా ఉండడానికి నానా కష్టాలు పడతాం. అటువంటిది అక్కడ వాతావరణం చూస్తే సోషలిస్టు వ్యవస్థ వుందా అనిపించింది. అక్కడికి చేరుకుంటున్న జనం నెలల పాటు సరిపోయే ఆహారధాన్యాలను వెంట తెచ్చుకొని పొయ్యి ఆర్పకుండా వంటలు చేస్తూనే వున్నారు. అక్కడికి ఎవరు వచ్చినా తిండి పెట్టకుండా పంపరు. వంట మనుషులు ఉండరు. అందరూ వంట చేయాల్సిందే. చూడడానికి పోయిన వారు కూడా తమకు కావాల్సింది వడ్డించుకొని తినవచ్చు. చివరకు ఈ ఉద్యమాన్ని అణచడానికి వచ్చిన సైనికులకు కూడా వీరే భోజనం పెడుతున్నారంటే మానవత్వం ఎలా వెల్లి విరుస్తోందో తెలుస్తుంది. ఆడ, మగ తేడా లేదు. కులం లేదు. మతం లేదు. ఒక్కటే నినాదం. 'హమ్ ఏక్ హై. నరేంద్ర మోడీ చోర్ హై'.
ఎక్కడ చూసినా విప్లవ వీరుడు భగత్ సింగ్ ఫోటోలు కనిపిస్తాయి. విప్లవ నినాదాలు వినిపిస్తాయి. ప్రసిద్ధ కవుల కవిత్వం, ఉద్యమాన్ని ప్రతిబింబించే చిత్రాలు ఆకట్టుకుంటాయి. కాబట్టి రెచ్చగొడితే పోరాటాలు జరగవు. మార్క్సిస్టు మేధావులు చెప్పినట్లు భావాలను ప్రజలు అంగీకరిస్తే అది భౌతిక శక్తిగా మారుతుంది. దేశ జనాభా లోని 10 శాతం సంపన్నులకు మినహా 90 శాతం మంది ప్రజలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నష్టదాయకమైన చట్టాలు ఇవి. వీటిని రద్దు చేయడం తప్ప మరో మార్గం లేదు.
దేశంలోని కోట్ల మంది సన్న, చిన్న కారు రైతులను భూముల నుండి వెళ్ళగొట్టి వారి శవాల దిబ్బల మీద కార్పొరేట్ వ్యవసాయానికి పూనుకుంది నేడు కేంద్రంలో ఉన్న బిజెపి. ఈ విధానాన్ని గ్రహించిన రైతాంగం ముందే మేల్కొని...కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పట్టుబడుతున్నారు. పోరాడుతున్నారు. రైతాంగం చేస్తున్న పోరాటానికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. రెండు రాష్ట్రాల్లో మొదలై...10 రాష్ట్రాలకు విస్తరించి....చివరకు దేశ వ్యాపితంగా కార్పొరేట్, సంపన్నులు మినహా సమస్త ప్రజానీకం మద్దతు లభిస్తోంది. వీరికి విజయం చేకూరాలని ఆశిద్దాం, మనమూ ఒక చేయి వేద్దాం.
(వ్యాసకర్త వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
సెల్: 94900 98980)
వి. వెంకటేశ్వర్లు











