Dec 22,2021 08:09
  • ఆగస్టులో రెండు శాతం పన్ను పెంపు
  • పాత బకాయిదారులకూ వర్తింపు
  • అధికారుల నిర్లక్ష్యంతో మరో ఐదు శాతం భారం
  • గగ్గోలు పెడుతున్న భవన నిర్మాణ యజమానులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : శ్రీకాకుళం నగరానికి చెందిన తాలాసు వెంకట రమణ అనే వ్యాపారి నగరానికి ఆనుకుని ఉన్న పెద్దపాడులో 2014లో సెంటు రూ.రెండు లక్షల చొప్పున మూడు సెంట్ల స్థలాన్ని రూ.6 లక్షలకు కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్నాడు. అది వ్యవసాయ భూమి కావడంతో నాలా (వ్యవసాయేతర భూముల చట్టం) పన్ను కట్టాలంటూ రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఆయనకు నోటీసు ఇచ్చారు. ప్రస్తుతం దాని మార్కెట్‌ విలువ రూ.13 లక్షలుగా నిర్ణయించి పది శాతం పన్ను విధించారు. అంటే రూ.1.30 లక్షల పన్ను వేశారు. ముందుగానే నాలా పన్ను వేసి ఉంటే ఆయన మూడు శాతం అంటే రూ.18 వేలే చెల్లించాల్సి వచ్చేది.
     కవిటి మండల కేంద్రానికి చెందిన సత్యానంద్‌ అనే ఉపాధ్యాయుడు 2017లో 2.75 సెంట్ల స్థలాన్ని రూ.2.10 లక్షలకు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. పంచాయతీ అధికారులు ప్లాన్‌ అప్రూవల్‌ కూడా ఇచ్చారు. నాలా పన్ను కట్టాలంటూ రెవెన్యూ అధికారులు ఆయనకు ఇప్పుడు నోటీసు ఇచ్చారు. ప్రస్తుతం దాని మార్కెట్‌ విలువ రూ.2,66,200కు చేరింది. దీంతో, పది శాతం పన్ను లెక్కించి రూ.26,620 చెల్లించాలని నోటీసు ఇచ్చారు. 2017లోనే నాలా పన్ను కట్టించుకుని ఉంటే ఆయన రూ.6,300 మాత్రమే చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం ఆయనపై సుమారు రూ.20 వేలు భారం పడింది. ఇది ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనూ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది.
    ఆదాయ వనరుల కోసం పలు మార్గాలు అన్వేషిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం నాలా పన్ను వసూళ్లపై దృష్టి సారించింది. గతంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను స్పెషల్‌ డ్రైవ్‌ పేరుతో డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించింది. వీటిని మూడు కేటగిరీలుగా విభజించింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్నా, ఇప్పటివరకు పన్ను చెల్లించనవి... భూ మార్పిడి జరిగినా పూర్తి స్థాయిలో చెల్లించనవి... వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్న భూమిలో కొంత భాగానికి పన్ను చెల్లించని వారి నుంచి పది శాతం మేర నాలా పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. వీటిపై అన్ని జిల్లాల రెవెన్యూ అధికారులూ కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఒక్క శ్రీకాకుళం జిల్లా నుంచే రూ.8.97 కోట్లు రావాల్సి ఉంటుందని జిల్లా అధికారులు లెక్కగట్టారు. ఇందులో ఇప్పటివరకు రూ.13.60 లక్షలు వసూలు చేశారు.
 

                                        పన్ను పెంచి... అపరాధ రుసుము విధించి

జనం నుంచి పన్నులు రాబట్టమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం... నాలా పన్నును పెంచి మరీ వసూలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎపి అగ్రికల్చర్‌ చట్టం-2006 చట్టాన్ని సవరించి ఈ ఏడాది జులై 29న వన్‌ టైం కన్వర్షన్‌ చట్టాన్ని తీసుకొచ్చింది. అప్పటివరకు మూడు శాతం ఉన్న నాలా పన్నును ఐదు శాతానికి పెంచింది. కొత్త పన్ను ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మార్పిడి జరిగిన వ్యవసాయ భూములకు విధించాల్సిన పన్నును పాత బకాయిదారులపైనా రుద్దడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు శాతం వసూలు చేయాల్సిన చోట అపరాధ రుసుము పేరుతో ఏకంగా పది శాతం వసూలు చేస్తుండడంపై నివాస, వాణిజ్య భవన యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

                               అధికారుల నిర్లక్ష్యంతో అదనంగా ఏడు శాతం పన్ను

అధికారుల నిర్లక్ష్యంతో జనంపై ఏడు శాతం అదనంగా రుసుము పడుతోంది. సకాలంలో వసూలు చేయనందుకు అపరాధ రుసుము, ప్రభుత్వం తాజాగా పెంచిన రెండు శాతం భారం భవన నిర్మాణ యజమానులపైనే పడుతోంది. వ్యవసాయేతర భూముల్లో భవన నిర్మాణాలకు అనుమతులిచ్చే ముందు నాలా పన్ను కట్టారో, లేదో చూసి అప్రూవల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అవేవీ లేకుండానే అనుమతులు మంజూరు చేసేశారు. క్షేత్రస్థాయిలో విఆర్‌ఒలు పరిశీలించి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేస్తున్న చోట భూముల రిజిస్ట్రేషన్‌ ఆపాలంటూ రిజిస్ట్రేషన్‌ శాఖకు లేఖ రాయాల్సి ఉన్నా, ఆ పనీ చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంతో భవన నిర్మాణ యజమానులు అదనపు భారం మోయాల్సి వస్తోంది.