హిందూపురం : బడిఇస్సు అంటే భధ్రత అధికంగా ఉండాలి. పలు నియమ నిబందనలూ పాటించాలి. అయితే హిందూపురంలో నిబంధనలకు నీళ్లు వదలి ఓ కార్పొరేట్ పాఠశాల, ఓ ప్రవేటు ట్రావెల్స్ బస్సు ద్వారా విద్యార్థులను రోజు తరలిస్తోంది. బహిరంగంగా రోడ్డుపై ప్రయివేటు ట్రావెల్స్ ద్వారా తరలిస్తున్నా రవాణ శాఖ, విద్యాశాఖ అధికారులు దీనిపై నోరుమెదపడం లేదు. ఆ పాఠశాలల నుంచి పెద్ద ఎత్తున విద్యాశాఖ, రవాణ శాఖకు మాముళ్లు అందుతుండడం వల్లనే వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు పెద్ద ఎత్తున వినపిస్తున్నాయి.
ప్రయివేటు పాఠశాలల నిర్వహకులు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేయాల్సి ఉంది. హిందూపురంలో నారాయణ పాఠశాల నిర్వహకులు గత కొన్ని నెలలుగా జెఎంఎస్ ట్రావెల్స్ బస్సు నెంబరు ఎపి02వై 8034లో విద్యార్థులను వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో పాటు కొన్ని కార్పోరేట్, ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తితో నిబంధనలను కాలరాస్తు, పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలిస్తున్నారు. నిబంధనల మేరకు చిన్న బస్సులో 24 మంది, పెద్ద బస్సులో 55 మందికి మించి ఎక్కించరాదు. అయితే చిన్న బస్సుల్లో 40 నుంచి 50 మందిని, పెద్ద బస్సుల్లో 70 నుంచి 80 మంది వరకు ఎక్కిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలా భద్రతా ప్రమాణాలను యాజమాన్యాలు గాలికి వదిలేసి బస్సులు నడుపుతున్నారు. ఏదైనా జరగరానిది జరగితే ఎన్నో కుటుంబాలు కడుపుకోతకు గురికావాల్సి వస్తోందన్న విషయాన్ని విస్మరించి విద్యాసంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.
నిబంధనలు ఇవి...
ప్రయివేటు విద్యాసంస్థలు బడి బస్సులు నడపాలంటే అందులో తగిన సౌకర్యాలు కల్పించాలి. బస్సులో సీట్ల కెపాసిటీని బట్టి విద్యార్థులను ఎక్కించాలి. బస్సులో అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు విద్యార్థులు సురక్షితంగా బయటపడటానికి అత్యవసర ద్వారాలు ఉండాలి. బస్సు డ్రైవర్‌కు ఐదేళ్ల అనుభవంతో పాటు లైసెన్స్, డ్రైవర్ ఆరోగ్య, మానసిక పరిస్థితులపై వైద్యులు పరీక్షలు చేసిన ధ్రువపత్రం ఉండాలి. బస్సులో తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ బాక్సు అందుబాటులో ఉంచాలి. ఎంత మంది విద్యార్థులను తరలిస్తున్నారు.. వారి వివరాలు, డ్రైవర్, క్లీనర్ పేర్లు, ఫోన్ నెంబర్లు తప్పని సరిగా బస్సులో ఉంచాలి. పంక్చర్ అయితే మార్చుకునేందుకు వీలుగా స్టెఫ్‌నీ ఉండాలి. అయితే ఈ నిబంధనలు పట్టణంలో చాల ప్రయివేటు పాఠశాలలు పాటించడం లేదు.
నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలి
బాబావలి ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి.
ఎక్కడైన పాఠశాల బస్సుకు ప్రమాదం జరిగితే మాత్రం రవాణా, పోలీస్ శాఖ అధికారులు తనిఖీల పేరుతో హడావుడి చేస్తారు. హిందూపురంతో పాటు జిల్లాలోని పలు కార్పొరేట్ విద్యాసంస్థలతో పాటు కొన్ని ప్రవేయిటు పాఠశాలల యాజమాన్యాలు బస్సుల్లో నాణ్యత ప్రమణాలు పాటించడం లేదు. వెంటనే రవాణ శాఖ, పోలీస్ శాఖతో పాటు విద్యాశాఖ అధికారులు సంయుక్తంగా తనఖీలు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో విద్యాశాఖ, రవాణాశాఖ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం.










