హిందూపురం : ఆదాయం మూరెడు....ఆశ బారెడు....అన్న చందంగా హిందూపురం పురపాలక సంఘం తయారైంది. హిందూపురం మున్సిపల్ వాస్తవ ఆదాయం ఏడాదికి రూ.30 కోట్ల వరకు ఉంటుంది. మరింత పన్నుల పెంపుతో పాటు చెత్త పన్ను భారీగా వసూలు చేసి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అది రూ.55 కోట్లకు పెంచాలని పాలకులు నిర్ణయించారు. వచ్చిన ఆదాయం అంతా గత పాలకులు చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలకు, విద్యుత్ బిల్లులు, పారిశుధ్య వాహనాల నిర్వహణ, పారిశుధ్యం, ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులతో వేతనాలకే సరిపోవడం లేదు. ప్రారంభ నిల్వ రూ.55.13 కోట్లు, సాధారణ జమలు 46.07 కోట్లతో కలిపి 2023-24లో అన్ని పద్దులూ రూ.119,34,95,500 ఆదాయంతో మొత్తం రూ.174,48,41,675తో హిందూపురం పురపాలక సంఘ బడ్జెట్‌ను అధికారులు రూపోందించారు. దీనిపై మంగళవారం హిందూపురం పురపాలక సంఘ సమావేశం మున్సిపల్ ఛైర్‌పర్సన్ డిఎన్ ఇంద్రజ అధ్యక్షతన రెండు సమావేశాలు జరుగుతున్నాయి. మొదట ప్రత్యేక సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. అనంతరం సాధరణ సమావేశం నిర్వహించి, ఇందులో 30 అంశాలతో కూడిన అజెండాను అధికారులు ప్రవేశ పెట్టనున్నారు. వచ్చిన ఆదాయంలో మున్సిపాల్టీ పొరుగు సేవల ఉద్యోగుల వేతనాలు, విద్యుత్ ఛార్జీల చెల్లింపు, నీటి సరఫరా విభాగం అప్పులు, వడ్డీల చెల్లింపుకే రూ.30 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. మున్సిపల్ పాలన, నీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణకు రూ.10 కోట్లు పైగా అవసరం. మరో వైపు మున్సిపాల్టీకి ప్రభుత్వం నుంచి కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు మినహా ఏ రకంగాను ఒక్క రూపాయి నిధులు కూడా ఏ పథకం అమలుకు గానీ నాలుగేళ్లుగా డబ్బులు రావడం లేదు. దీంతో జనంపై భారీగా భారం మోపడానికి పాలకులు సిద్ధం అయ్యారు. వచ్చిన ఆదాయం ఖర్చులకు సరిపోతున్నా, ప్రభుత్వం నుంచి గ్రాంట్లు రాకున్నా, మరో నెల రోజుల్లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ ప్ర్రారంభ నిల్వ రూ.55 కోట్లు మున్సిపాల్టీ వద్ద ఉన్నట్లు, వాటికి మున్సిపాల్టీ సొంత ఆదాయం రూ.55 కోట్లు ప్రభుత్వం ఇచ్చే మూలధన గ్రాంట్లు మొత్తంగా రూ. రూ.65 కోట్లను కలిపితే మొత్తం బడ్జెట్ రూ.175 కోట్లు అవుతుందని అధికారులు ప్రకటించారు. ఇందులో ఈ ఏడాది వ్యయం రూ. 118 కోట్లు చేస్తున్నట్లు, రూ.57 కోట్లు మిగులుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎక్కడ మిగులు ఉందో అర్థం కాక తలపట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. అంకెల గారడీతో పెద్ద బడ్జెట్‌ను రూపొందించారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మున్సిపల్ వాస్తవ ఆదాయం రూ.30 కోట్లుగా పేర్కొన్న అధికారులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.55 కోట్లు వస్తుందని అంచనా వేశారు. ఖర్చు సైతం అదే స్థాయిలో ఉంటుందని రూ.40 కోట్లు, వ్యయాన్ని అంచనా వేశారు. మిగిలిన రూ.15 కోట్లు అభివద్ది పనులకు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. మూలధన జమలు కింద 15వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే వస్తుండటంతో బడ్జెట్ భారీగా కనిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ల సొమ్ము రూ.50 కోట్లను మున్సిపల్ మూలధన ఖాతాలో చూపడం చూస్తుంటే మున్సిపల్ బడ్జెట్ అంకెల గారెడి తరహాలో ఉంది నిపుణులు పేర్కొంటున్నారు.
హిందూపురం మున్సిపల్ కార్యాలయం










