Feb 10,2023 22:48

ఫొటో : స్టేట్‌ బ్యాంకు ఎదుట నిరసన ధర్నా చేస్తున్న సిపిఐ నాయకులు

అదాని ఆస్తులను జాతీయం చేయాలి
ప్రజాశక్తి-కావలి : బ్యాంకు రుణాల పేరుతో ప్రజలసొమ్ము ఎగ్గొట్టే గౌతమ్‌ అదానీ ఆస్తులను జప్తు చేసి, జాతీయం చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో శుక్రవారం ఎస్‌బిఐ మెయిన్‌ బ్రాంచి ఎదుట నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తూ దేశసంపదను సహజ వనరులను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెడుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని మోడీ, గౌతమ్‌ అదానీ ఛిన్నాభిన్నం చేశారని, మోడీలాంటి ప్రధాని ఉంటే భారతదేశం గాడాంథకారంలోకి వెళ్లిపోయే ప్రమాదముందన్నారు. మోడీ ప్రభుత్వ రంగ సంస్థలైన విమానాశ్రయాలను, పోర్టులు, బొగ్గు, విద్యుత్‌, సిమెంట్‌, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్‌ తదితర రంగాలన్నీ గౌతమ్‌ అదానీకి కట్టబెట్టడం దారుణమన్నారు.
కరోనా ప్రమాదకర సమయంలో ప్రజల పంపదను అడ్డగోలుగా దోచారన్నారు. కేంద్ర బడ్జెట్‌ లో ఎపికి విభజన హామీలు అమలు చేయలేదన్నారు. తీరని ఆన్యాయం జరిగినా నోరు మెదపని సిఎం, జగన్మోహన్‌రెడ్డి అవినీతి అదానికి భూ కేటాయింపులు చేశారని విమర్శించారు. కార్యక్రమానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కె.నాగరాజు, ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బలిజేపల్లి వెంకటేశ్వర్లు, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అద్యక్షులు దమ్ము దర్గాబాబు, సుబ్రమణ్యం, నారాయణ, అంకయ్య, కిషోర్‌, తదితరులు పాల్గొన్నారు.