గోరంట్ల టౌన్, సోమందేపల్లి : రాష్ట్రం, పెనుకొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని, మరో 24 గంటలు పెనుగొండ నియోజకవర్గంలోనే ఉంటానని, దమ్ముంటే అభివద్ధిపై చర్చకు రావాలంటూ వైసిపి నేతలకు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు. లోకేష్ యువగళం పాదయాత్ర మంగళవారం 53వ రోజుకు చేరుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గుమ్మయగారిపల్లి నుంచి కొత్తపల్లి, మల్లాపల్లి, పాలసముద్రం వరకు పాదయాత్ర నిర్వహించారు. మల్లాపల్లిలో ఇటుకల తయారీ కార్మికులతో భేటీ అయ్యారు. పాలసముద్రం క్రాస్ వద్ద బీసీలతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని వడ్డెర్లు, ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకులు, నారా లోకేష్‌కు విన్నవించారు. సమస్యలను పరిష్కరించాలని మల్లాపల్లి వద్ద ఇటుకుల బట్టి వేసుకుని జీవనం సాగిస్తున్న ఫిరోజ్ బాషా నారా లోకేష్‌కు వినతిపత్రం అందజేశారు. నిర్మాణ రంగంలో కీలకంగా ఉన్న ఇటుకల తయారీ కార్మికులకు అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తామనీ, ఇటుకల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి షెడ్ల నిర్మాణానికి సబ్సిడీ రుణాలు ఇస్తామనీ, తయారీకి అవసరమైన మట్టి, కట్టెలకు ఉచితంగా అనుమతులు ఇస్తామనీ లోకేష్ హామీ ఇచ్చారు. సాయంత్రం పాదయాత్ర సోమందేపల్లి మండలంలోకి ప్రవేశించింది. గుడిపల్లి పారిశ్రామిక వాడ దగ్గర కియా అనుబంధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పాదయాత్రలో వస్తున్న లోకేష్‌ను కలిశారు. అనంతరం సగర ఉప్పర కులస్తులు కలిసి వారి సమస్యలను తెలియజేశారు. గుడిపల్లి గ్రామ ప్రజలతో లోకేష్ మాటామంతి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. రాయినపల్లి సమీపంలో యాదవ కులస్తులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు అందిస్తామన్నారు. టిడిపి హయాంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సైతం ఇదే రకమైన అభివృద్ధి జరిగిందన్నారు. పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఏం చేశావని ప్రశ్నిస్తే ఆయన తనను బూతులు తిడుతున్నాడు తప్పా అభివద్ధిని చెప్పడం లేదన్నారు. ప్రజల కోసం వైసిపి నాయకులతో ఎన్ని బూతులు తిట్టించుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అభివృద్ధి పనులపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని, ఎవరైనా దీనిని స్వీకరించవచ్చని వైసిపి నేతలకు సవాల్ విసిరారు. 2024 సంవత్సరంలో టిడిపి అధికారంలోకి రాగానే బిసిలకు రాజకీయంగా సీట్లు కేటాయించి చట్టసభల్లో అవకాశం కలిపిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను ఇవ్వండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌లు అందక పేద విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంటు, స్కాలర్‌షిప్‌లను నేరుగా విద్యార్థులకు అందిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిని విస్మరించి పాలన సాగిస్తున్న సైకో ప్రభుత్వానికి బుద్ధి చెప్పి సైకిల్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ ఎమ్మెల్యే, సత్యసాయి జిల్లా టిడిపి అధ్యక్షులు బికె.పార్థసారథి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సబితమ్మ, మండల కన్వీనర్ సోమశేఖర్, పార్లమెంట్ కార్యదర్శి నరసింహులు, మండల ప్రధాన కార్యదర్శి అశ్వర్థరెడ్డి, వేణు, జయరాం, ఫిరోజ్ బాషా, వెంకటరమణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
లోకేష్‌కు జననీరాజనం..
పెనుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న లోకేష్ పాదయాత్రకు టిడిపి శ్రేణులు జననీరాజనం పలుకుతున్నారు. పెనుకొండ నియోజకవర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభిమానాన్ని చాటుతున్నారు. లోకేష్‌తో సెల్ఫీలు తీయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్తపల్లి వద్ద హిందూపురం పార్లమెంట్ టిడిపి కార్యదర్శి నరసింహులు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర వెళ్తున్న గ్రామాల సమీపంలో ఆయా గ్రామాల టిడిపి నాయకులు భారీ పూలమాలలతో స్వాగతం పలుకున్నారు.










