Apr 24,2023 21:23

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి : ఎంపీ

రాయచోటి : జిల్లాలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వివిధ శాఖల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో జిల్లా అభివృద్ధి సహకార, పర్యవేక్షణ కమిటీ కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలన్నారు. కరెంటు లైన్‌ షిఫ్టింగ్‌ పనులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్‌ హైవేలో తప్పకుండా లైటింగ్‌ సదుపాయం ఉండేటట్లు చూడాలని ట్రాన్స్‌కో అధికారులకు తెలిపారు. కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ జిల్లాలో సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకున్న 3 వేల మంది అర్హులందరికీ వెంటనే పొజిషన్‌ సర్టిఫికెట్‌ ఇచ్చి ఇల్లు మంజూరు చేయించాలని హౌసింగ్‌ అధికారులకు తెలిపారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీల సంఖ్యను పెంచి వారికి సకాలంలో పేమెంటు జరిగేటట్టు చూడాలన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాట్లాడుతూ జిల్లాలో వైయస్సార్‌ జలకల పథకం చాలా పూర్‌గా ఉందని ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని డ్వామా పీడీకి సూచించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ రైల్వేకోడూరు నియోజకవర్గంలో 16 జగనన్న హౌసింగ్‌ లేఅవుట్లు ఉన్నాయని ఈ లే అవుట్‌లలో విద్యుత్‌ కనెక్షన్‌లు వెంటనే ఇవ్వాలన్నారు. మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్‌బాషా మాట్లాడుతూ అధికారులు ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాధ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురైన కట్టకిందపల్లె బాధిత మహిళ కుటుంబానికి విద్యుత్‌ అధికారులు వెంటనే ఆర్థిక సహాయం అందజేయడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. నియోజకవర్గంలో చింతలకోన మారుమూల గ్రామానికి ఎంపీ లాండ్స్‌ కింద రోడ్డు సౌకర్యం కల్పించాలన్నారు. ఎస్పీ గంగాధర్‌ రావు మాట్లాడుతూ రామాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కరెంటు సదుపాయం లేకపోవడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇక్కడ అవసరం మేరకు లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. నేషనల్‌ హైవేలో వెలుతురు లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వీటిపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఒ సత్యనారాయణ, డ్వామా పీడీ మద్దిలేటి, హౌసింగ్‌ పీడీ శివయ్య, వ్యవసాయ శాఖ జెడి ఉమామహేశ్వరమ్మ, ఐసిడిఎస్‌ పీడీ ధనలక్ష్మి, విద్యుత్‌ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
- సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మిథున్‌రెడ్డి