అభివృద్ధి పనులు, నిధులు మంజూరు చేయాలని వినతి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, ప్రజోపయోగమైన పనులు, జగనన్న ఇళ్లు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్‌ను బుధవారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ హైలెవల్ కెనాల్ నిర్మాణంలో భాగంగా భూములు అందచేసిన మర్రిపాడు మండలం పడమటినాయుడుపల్లి గ్రామ రైతులకు నష్టపరిహారం అందజేయాలని కోరారు. అదే విధంగా పడమటి నాయుడుపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలతో పాటు సమీప నియోజకవర్గాల ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తుందని, జిల్లా వైద్యశాలకు అదనపు సౌకర్యాలు ఏర్పాటుకు ఎపిఎంఎస్ ఐడిసి ద్వారా నిధుల మంజూరు విషయమై చొరవ చూపాలని కోరారు. మర్రిపాడు మండలం భీమవరం గ్రామంలో, ఆత్మకూరు మండలం బోయలచిరువెళ్ల, ఆనంతసాగరం మండలం గౌరవరంలలో నూతన ఆంగన్‌వాడీ భవనాలను మంజూరు చేయించాలన్నారు. చిలకపాడు గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్‌కు క్రీడామైదానానికి స్థలం కేటాయించాలని కోరారు. ఆత్మకూరు మండలం కరటంపాడులో నూతనంగా మంజూరు చేసిన బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలకు అనుసంధానంగా నూతనంగా ఎస్‌సి వెల్ఫేర్ బిల్డింగు మంజూరు చేయించాలని కోరారు. మురగళ్ల గ్రామంలోని శ్మశానవాటికకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో 14వ ఆర్థిక సంఘం ద్వారా జరిగిన అభివృద్ధి పనులు సిఎఫ్‌ఎస్‌ఎఎస్ అప్లోడ్ జరగకుండా నిలిచాయని, బిల్లుల మంజూరుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ పరిధిలోని ఎల్పాల్లి పాఠశాల వద్ద ఖాళీగా ఉన్న ఇరిగేషన్ భూమిపై పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని కోరారు. సంగం మండలం అన్నారెడ్డిపాళెంలో ఇంటి స్థలాల మంజూరుకు స్థల సేకరణ త్వరితగతిన చేపట్టాలని, గాంధీజన సంఘంలో 40 మంది. వెంగారెడ్డిపాళెంలో 30 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేసేరా చర్యలు తీసుకోవాలని కోరారు. మండల కేంద్రమైన సంగంలో శ్మశానవాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించేలా చూడాలని, సర్వే నెంబర్ 252లో కొండ పోరంబోకు భూమిలో 15 మంది లబ్ధిదారులు పొజిషన్ సర్టిఫికెట్ల కోసం విన్నవించారని, విషయమై పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. అన్నారెడ్డిపాళెం గ్రామంలో తాగునీటి పైప్ లైన్ మంజూరు చేయించాలన్నారు. ఎఎస్‌పేట మండలం శ్రీకొలనులోని కమ్యూనిటీ హాల్ మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించాలని, జువ్వలగుంటపల్లిలో అదనపు తరగతి గదులు అవసరమని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. శ్రీకొలను ఎస్‌సి కాలనీలో నూతనంగా 34 మంది లబ్ధిదారులు ఇళ్లు మంజూరు చేయించాలని కోరారని, త్వరితగతిన వారికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల కేంద్రమైన అనంతసాగరంకు మినీ స్టేడియం మంజూరు చేయించాలని, అదే విధంగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు, కళ్యాణ మండపం నిర్మాణాలకు భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొమ్మలేరు మీడియం డ్రైన్ వెడల్పు పనుల కోసం శంకరనగరం, మినగల్లు, కొత్తపల్లి గ్రామాలకు చెందిన రైతులు భూములు అందచేశారని, వారికి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కచిరిదేవరాయపల్లిలోని గుర్రం కాలువ మరమ్మతుల కోసం డిస్ట్రిక్ మినరల్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేయాలని, శంకరనగరం గ్రామంలోని ఎంపిపి పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని కోరారు. ఆదురుపల్లి ఎబిఎస్‌సి వెల్ఫేర్ రెసెన్షియల్ పాఠశాలో సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం, తాగునీటి వసతి కల్పించాలని, మండల కేంద్రమైన చేజర్లలోని ఊటకాలువ, గ్రామ మసీదు బావి పునరుద్ధరణ కోసం చర్యలు చేపట్టాలని కోరారు.










