ప్రజాశక్తి-తనకల్లు, నల్లచెరువు, కదిరి టౌన్, అర్బన్
టిడిపి హాయాంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధి జరిగేలా పాలన సాగిందని టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 46వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోకి చేరుకుంది. శుక్రవారం నాడు తనకల్లు మండలానికి చేరుకున్న యాత్ర శనివారం నుంచి చీకటిమానిపల్లిలో బస చేసిన ప్రాంతం నుంచి లోకేష్ పాదయాత్ర కొనసాగించారు. జిల్లాలో మొదటి రోజు తనకల్లు, నల్లచెరువు మండలాల పరిధిలో కొనసాగింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే, కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా ఆధ్వర్యంలో లోకేష్‌కు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. లోకేష్ పాదయాత్ర చేస్తూ ఆయా ప్రాంతాల్లో ప్రజలను పలకరిస్తూ, మాట్లాడుతూ ముందుకు నడిచారు. గిరిజన, దళిత కుటుంబ సభ్యులతో ముఖాముఖి నిర్వహించారు. తనకల్లు మండలం గంగసానిపల్లి వద్ద టమోటా రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో లోకేష్ ప్రసంగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంతో కషి చేసిందన్నారు. ఆ కషి ఫలితమే పెనుకొండ వద్ద ప్రపంచ స్థాయి కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు అయ్యిందన్నారు. జాకీ కంపెనీ వస్తే కమీషన్ల కోసం దానిని వైసిపి నాయకులు అడ్డుకున్నారని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఐటీ పరిశ్రమను ఎంత అభివద్ధి చేశారని తెలిపారు. వైసిపి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారాని ప్రశ్నించారు. టిడిపి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. నిరుద్యోగుల కోసం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, అత్తార్ చాంద్‌బాషా, తిప్పేస్వామి, తెలుగు యువత నాయకులు ఎస్.బాబ్జాన్, ఎంఎస్.రాజుతో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్లచెరువు : తలమర్లవాండ్లపల్లి గ్రామపంచాయతీ ఎర్రగుంటపల్లి వద్ద శనివారం సాయంత్రం లోకేష్ పాదయాత్ర నల్లచెరువు మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా టిడిపి నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర సందర్భంగా చిన్నపల్లోళ్లపల్లి వద్ద నారా లోకేష్ రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రాజశేఖర్, మాజీ ఎంపిపి మాబు సాబ్, మాజీ జెడ్పిటిసి అబ్దుల్ ఖాదర్, నల్లచెరువు సింగల్ విండో మాజీ అధ్యక్షుడు తవలం వేణుగోపాల్, అంజనప్ప, సీనియర్ నాయకులు నాగభూషణ నాయుడు, లక్ష్మీపతి నాయుడు, తలమర్లవాండ్లపల్లి సర్పంచి హర్షవర్ధన్ నాయుడు, రమేష్ నాయుడు, మదన్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎర్రగుంటపల్లిలో స్వల్ప ఉద్రిక్తత.. జై జగన్ అంటూ వైసిపి నేతల నినాదాలు
నల్లచెరువు మండల పరిధిలోని తలమర్లవాండ్లపల్లి గ్రామపంచాయతీ ఎర్రగుంటపల్లి వద్ద తనకల్లు నుంచి లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాదయాత్ర ఎర్రగుంటపల్లి గ్రామం వద్దకు రాగానే అదే గ్రామానికి చెందిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తవలం నాగభూషణ, మరి కొంతమంది జై జగన్ అని నినాదాలు చేశారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వెంటనే పోలీసులు కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.
నేటి పాదయాత్ర ఇలా...
కదిరి టౌన్ : లోకేష్ పాదయాత్ర ఆదివారం 47వ రోజు నల్లచెరువు మండలంలో కొనసాగనుంది. ఉదయం 8గం||లకు చినపిల్లోలపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 8-15కు సంజీవుపల్లిలో స్థానికులతో మాటామంతి, 10-05కు నల్లచెరువులో చేనేతలతో సమావేశం, 10-45కు ఘాజీఖాన్ పల్లి వద్ద స్థానికులతో మాటామంతి ఉంటుంది. 11-50కు పయాలవారిపల్లిలో భోజన విరామం, 2-25కు పయాలవారిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. 2-45కు నల్లచెరువు రైల్వేస్టేషన్ వద్ద స్థానికులతో మాటామంతి, 3గం||లకు యువగళం పాదయాత్ర 600 కిలోమీటర్లకు చేరుతుంది. 3-25కు రత్నాలపల్లిలో కురుబ సామాజికవర్గీయులతో భేటీ, 4-05 గంటలకు బొమ్మిరెడ్డిపల్లిలో స్థానికులతో మాటామంతి నిర్వహిస్తారు. 4.40కు చిన్నయాళ్లంపల్లిలో 600 కిలోమీటర్ల పాదయాత్ర సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. 5గంటలకు జోగన్నపేట బహిరంగసభలో లోకేష్ ప్రసంగిస్తారు. 6 గంటలకు జోగన్నపేట విడిదికేంద్రంలో బస చేస్తారు.
మోకాళ్లపై కూర్చొని వికలాంగుడితో మాట్లాడుతున్న నారా లోకేష్










