May 19,2023 21:01

- సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : జిల్లా పరిధిలో ప్రభుత్వ ఇంజినీరింగ్‌ శాఖల ద్వారా చేపట్టిన అభివద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ సంబంధిత ఇంజినీరింగ్‌ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్‌, ఆర్డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, ఎపిఎస్‌పిడిసిఎల్‌, ట్రాన్స్‌కో తదితర ఇంజినీరింగ్‌ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పూర్వపు జిల్లాలైన కడప, చిత్తూరులలో ఆయా ఇంజినీరింగ్‌ శాఖల ద్వారా అన్నమయ్య జిల్లా పరిధిలో చేపట్టిన పనులలో నిర్దిష్ట కాల పరిమితిలో లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బి పంచాయతీరాజ్‌ ఆర్‌డబ్ల్యుఎస్‌ విద్యుత్‌ ఇరిగేషన్‌ శాఖల ద్వారా అన్నమయ్య జిల్లా పరిధిలో ప్రతిపాదించిన పనులు, అనుమతులు మంజూరైన పనులు, పూర్తి చేసిన పనులు పెండింగ్‌ పనులు, ఇంకనూ పెండింగ్‌ ఉండడానికి గల కారణాలపై ఆయా శాఖల అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి చేసిన పనులకు ఎంత మేర బిల్లులు చెల్లింపులు జరిగాయి, ఇంకను చెల్లించాల్సిన బిల్స్‌ ఎన్ని తదితర వివరాలపై ఆరా తీశారు. పూర్తి చేసిన పనులకు ఎప్పటికప్పుడూ బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని చెప్పారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం సేకరించిన భూములకు సంబంధించిన నిర్వాసితులకు పరిహారం త్వరితగతిన చెల్లించాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో ఎన్‌హెచ్‌ - 440, ఎన్‌హెచ్‌-42 జాతీయ రహదారుల భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు అంశంపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాయచోటి-వేంపల్లి ఎన్‌హెచ్‌-440 కోసం 50 ఎకరాలు, ములకల చెరువు - మదనపల్లి ఎన్‌-42 కోసం 45 ఎకరాలు భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. ఈ మేరకు సేకరించిన భూములకు సంబంధించి నిర్వాసితులకు ఈ నెలాఖరులోగా పరిహారాన్ని త్వరితగతిన చెల్లించాలన్నారు. ఎన్‌హెచ్‌ 440, ఎన్‌హెచ్‌ 42 లలో ఎంత భూసేకరణ జరిగింది, ఇంకెంత చేయాలి, భూ సేకరణలో ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం, భూమి కోల్పోయిన వారికి ఇప్పటివరకు అందజేసిన పరిహారం, ఇంకను అందజేయాల్సిన పరిహారం తదితరాలపై కలెక్టర్‌ సమీక్షించి తగు దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో ఆర్‌అండ్‌ బి, పంచాయతీరాజ్‌, ఆర్డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌, జాతీయ రహదారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.