Aug 04,2021 06:25

    పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల మొదటి వారంలోనే మోడీ ప్రభుత్వ స్వభావం గురించి చాలా విషయాలు వెల్లడయ్యాయి. కొద్ది రోజుల వ్యవధి లోనే ప్రభుత్వం రెండు అబద్ధాలను నమోదు చేసింది. భారత్‌లో పెగాసస్‌ స్పై వేర్‌ను ఉపయోగించడంపై మీడియాలో వచ్చిన వార్తలను సమాచార సాంకేతిక శాఖ మంత్రి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతూ ఒక ప్రకటన చేశారు. అనధికారికంగా ఎవరిపైనా ఎలాంటి నిఘా లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యులొకరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఎవరూ మరణించలేదంటూ దిగ్భ్రాంతికరమైన రీతిలో ప్రకటించారు. ఈ రెండు తప్పుడు ప్రకటనలు మోడీ ప్రభుత్వ నిరంకుశవాదాన్ని తెలియచేస్తున్నాయి. పార్లమెంట్‌, ప్రజల పట్ల ధిక్కారాన్ని తెలియచేస్తున్నాయి. వాస్తవాలను తిరస్కరించడం, అబద్ధాలు చెప్పడం ఈ ప్రభుత్వ వైఖరిగా మారిపోయింది. దేశం వ్యాక్సిన్‌ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో, ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. పైగా వ్యాక్సిన్‌ కొరత గురించి ఫిర్యాదు చేసిన రాష్ట్రాలు రాజకీయాలకు పాల్పడుతున్నాయంటూ ఆరోపించింది. లేదా ప్రజలకు వ్యాక్సిన్‌ వేయడంలో అసమర్ధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు చేసింది. కోవిషీల్డ్‌, కోవాక్సిన్‌ తయారీ సంస్థలు ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ల సంఖ్య, టీకా వేసేందుకు అందుబాటులో వున్న డోసుల సంఖ్యను పార్లమెంట్‌కు వెల్లడించడంలో ప్రభుత్వం మూడు భిన్నమైన కథనాలు వినిపించిందన్నది వేరే విషయం. వ్యాక్సిన్‌ ఉత్పత్తి రేటు పెరగలేదన్నది, అందుబాటులో వున్న వ్యాక్సిన్ల సంఖ్యను ప్రభుత్వం ఎక్కువ చేసి చెబుతోందన్నది వాస్తవం. కోవిడ్‌ వల్ల మరణించిన వారి సంఖ్యను తక్కువ చేసి చెప్పలేదని ప్రభుత్వం పదే పదే చెప్తోంది. కానీ మరోపక్క అధికారిక మృతుల సంఖ్యకు కనీసం పది రెట్లు ఎక్కువగా మరణాలు సంభవించాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. విశ్వసనీయమైన డేటా కొరవడడం లేదా తప్పుడు సమాచారానికి సంబంధించిన సమస్య కాదు ఇది. కోవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనడంలో ఉత్తరప్రదేశ్‌ లోని ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రధాని ప్రశంసించడంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి కొద్ది రోజలు ముందుగా 15వ తేదీన వారణాసిలో ఈ అధ్యయనాలను 'సరిపోలనివి' గా అభివర్ణించారు. ఉత్తరప్రదేశ్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమవడం, గంగా నదిలో శవాలు తేలుతూ కనిపించడం, వందలాది మృతదేహాలను గంగానది ఒడ్డున ఒకే చోట పూడ్చి పెట్టడం, ఎలాంటి చికిత్సలు అందుబాటులో లేకుండా గ్రామాలకు గ్రామాలు వైరస్‌ దాడితో విలవిల్లాడిపోతున్నాయని వచ్చిన వార్తలతో నిమిత్తం లేకుండా మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించిన తీరు అసాధారణమైనది. వాస్తవాలను లేదా సత్యాలను అసంగతమైనవిగా లేదా అంసబద్ధమైనవిగా పరిగణించే ప్రభుత్వమిది. వాస్తవాలు, వాస్తవిక పరిస్థితులను విస్మరిస్తూ తనదైన రీతిలో భాష్యం చెప్పే ప్రభుత్వమిదని మోడీ వైఖరి చూస్తే అర్ధమవుతోంది. ప్రజల ఉద్వేగాలను, పాతుకుపోయిన వ్యక్తిగత విశ్వాసాలను ఆకట్టుకునేలా చిత్రించడమే ప్రస్తుత పరిస్థితి. దీనికి సత్యంతో ఏమాత్రం సంబంధం (పోస్ట్‌-ట్రూత్‌) లేదు. అవి వ్యాక్సిన్లు గానీ లేదా ఆక్సిజన్‌ కొరత కారణంగా సంభవించిన మరణాలు కానీ లేదా కోవిడ్‌ మరణాల వాస్తవ సంఖ్య కానీ ఏదైనా మోడీ ప్రభుత్వ వైఖరి ప్రజల ప్రాణాల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది.
     ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏ ప్రభుత్వానికైనా ఇది సరికాదు. ఒక పక్క పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు జరుగుతుంటే మరోపక్క - గతేడాది ప్రభుత్వం ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతాంగం చేస్తున్న ఆందోళనలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ జంతర్‌ మంతర్‌ కూడలిలో ప్రతి రోజూ కిసాన్‌ సంసద్‌ (పార్లమెంట్‌) జరుగుతోంది. ఢిల్లీ సరిహద్దుల్లో 8 మాసాల పాటు సుదీర్ఘంగా ఆందోళనలు కొనసాగించిన తర్వాత తమ స్వంతంగా పార్లమెంట్‌ను నిర్వహించుకోవాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. పోలీసులు దీన్ని తీవ్రంగా ప్రతిఘటించినా జరుగుతోంది.
      ఇక్కడ కూడా, బిజెపి ప్రభుత్వ ప్రతిస్పందన సమస్యను విస్మరించేలా వుంది. దేశంలో వ్యవసాయం, రైతులకు సంబంధించి అంతా సాఫీగానే కొనసాగుతోందని చెప్పడానికి నటిస్తోంది. అక్కడ సమస్య వుందని మనం గుర్తించలేకపోతే అక్కడసలు సమస్యే లేదన్నది ఈ నిరంకుశ ప్రభుత్వ వికృత ధోరణిగా వుంది. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు సంబంధించి దేనికైనా పార్లమెంట్‌లో జవాబుదారీగా వుండేందుకు నిరాకరించడంతో ఒక రకమైన వింత పరిస్థితికి దారి తీస్తోంది. విచారణ జరపాల్సిన తప్పులేవీ జరగలేదంటూ రాఫెల్‌ ఒప్పందంపై దర్యాప్తుకు మోడీ ప్రభుత్వం పదే పదే తిరస్కరిస్తున్నందున ఇక ఫ్రాన్స్‌లో జరిగే జుడిషియల్‌ విచారణలోనే ఈ ఒప్పందానికి సంబంధించిన వాస్తవాలు వెలుగు చూడాల్సి వుంది. ఫ్రాన్స్‌ ప్రభుత్వం పెగాసస్‌ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతోంది. ఇజ్రాయిల్‌ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ తయారుచేసిన స్పైవేర్‌ విక్రయాలు, ఉపయోగాలకు అనుసరించిన పద్ధతులపై సమీక్ష జరుపుతామని ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ప్రకటించింది. కానీ భారత్‌లో మాత్రం అటువంటి విచారణ ఏదీ జరగడం లేదు. ఎందుకంటే ఇజ్రాయిల్‌ నుండి అటువంటి స్పైవేర్‌ను కొనుగోలు చేయడానికి ప్రభుత్వ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అంగీకరించడానికే ఈ ప్రభుత్వం తిరస్కరిస్తోంది.
      మోడీ ప్రభుత్వం దృష్టిలో సత్యం అనేది సంతలో సరుకులా వుంది. హిందూత్వ, నయా ఉదారవాద ఎజెండాల అమలే దాని లక్ష్యం. జనాభా నియంత్రణ, అన్ని రకాల పశువుల వధపై నిషేధం, లవ్‌ జిహాద్‌ చట్టాలు వంటి వాటిని ఎటువంటి అంతరాయం లేకుండా బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఇక కేంద్రం విషయానికి వస్తే, బడా కార్పొరేట్లను మరింత సుసంపన్నులను చేయాలన్నది అభిమతంగా వుంది. ఇందుకు గాను అత్యంత ప్రమాదకరమైన రీతిలో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చర్యలు చేపడుతోంది. బడా కార్పొరేట్ల రుణాలను రద్దు చేస్తోంది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులును ఎదుర్కొనేందుకు, కోవిడ్‌ వల్ల దెబ్బతిన్న ప్రజలకు, ఆర్థిక వ్యవస్థకు ఉపశమనం కలిగించేందుకు పెద్ద ఎత్తున నిధులు అవసరమైనప్పటికీ కార్పొరేట్లకు, సంపన్నులకు పన్నులను పెంచడానికి నిరాకరిస్తోంది.
కోవిడ్‌ మహమ్మారి దాని ప్రభావం పూర్తి స్థాయిలో కనబరిచే సమయానికి, ప్రజలంటే ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని, వారి పట్ల ఎలాంటి ఆందోళన లేదన్న కఠోర వాస్తవాన్ని మరింతమంది ప్రజలు తెలుసుకోగలుగుతారు.
 

/'పీపుల్స్‌ డెమోక్రసీ' సంపాదకీయం/