ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, మహిళలకు రక్షణ కల్పించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ... ప్రకాశం జిల్లాలో కన్నతండ్రి కూతురిని దారుణంగా హింసించి చంపాడన్నారు. తాగుడు వ్యసనంతో ఇలాంటి దుర్మార్గాలు పెరుగుతున్నాయన్నారు. మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరుగుతున్నాయని, మన జిల్లాలో ఘటనలు జరిగాయన్నారు. బాధిత మహిళలకు రక్షణ, భద్రత కల్పించి, వారికి పునరావాసం చర్యలు చేపట్టాలని కోరారు. ఉపాధి దొరకక, అప్పులు తీర్చుకునేందుకు భద్రత లేని ప్రయాణాలతో, వలసలతో నామమాత్రమైన వేతనాలతో పని చేస్తున్నారన్నారు. కరువు ఉన్న జిల్లాలు, ప్రాంతాలలో ఉపాధి హామీ పథకం కింద పనులు ఇవ్వాలనీ, వేతనాల బకాయిలు వెంటనే చెల్లించాలనీ, పట్టణ ఉపాధి చట్టం పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. రేషన్ డిపోల ద్వారా ఇస్తున్న కందిపప్పు గత 4 నెలలుగా ఇవ్వడంలేదని, తక్షణం కందిపప్పు, వంటనూనె సరఫరా చేయాలని.కలెక్టర్ ని కోరారు. డ్వాక్రా మహిళల కు ఇస్తున్న రుణం మొత్తానికి సున్నా వడ్డీ కింద వడ్డీ జమ చేయాలని, ఆయా కాలేజీ లో చదవుతున్న వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం సకాలంలో అమలు కానందున (ఉదా: ట్రిపుల్ ఐటీ) చదువు పూర్తి అయినా డిగ్రీ సర్టిఫికెట్ లు పొందలేకపోతున్నారన్నారు. మద్యం షాపులు తగ్గించాలని, మద్య వ్యతిరేక ప్రచారం చేయాలన్నారు. ఎడిక్షన్ కేంద్రాలు ప్రాంతీయ ఆసుపత్రుల్లో కూడా ఏర్పాటు చేయాలనీ, ఒంటరి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఐద్వా నాయకులు వి.లక్ష్మి, ఎం.సౌమ్య లు పాల్గొన్నారు.










