- వైసిపి ప్రభుత్వానికి సిపిఎంప్రశ్న
- మూలపేటలో అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : వి శీనివాసరావు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి: పారదర్శకతలేని పాలనతో వైసిపి ప్రభుత్వం అభాసుపాలవడం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్వాసితుల పోరాటంపై పోలీసులు ఉక్కుపాదం మోపి అక్రమ అరెస్టులకు పాల్పడడాన్ని ఖండిస్తున్నామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిఎం జగన్ రెండ్రోజులుగా ఢిల్లీలోని కేంద్ర మంత్రులను కలుస్తున్నారని, దానికి అజెండా ఏమిటో ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశారా? లేక స్వప్రయోజనాల కోసం కలిశారా? అనేది ప్రజలకు చెప్పాలన్నారు. పోలవరం పునరావాసానికి నిధులు ఎంత అడిగారని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాసమే కీలకమైన దృష్ట్యా ప్రతి రూపాయి పునరావాసానికే ఖర్చు చేయాలని కోరారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో విద్యుత్ కొరత గురించి చర్చించారా? లేక ఉత్పత్తిదారుల కోసం పైరవీలు చేస్తున్నారో? తెలపాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల క్రితం రాష్ట్రానికి అదానీ వచ్చి ముఖ్యమంత్రి జగన్‌కు కలిశారని, ఆ సమావేశం విషయాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించట్లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ కోసమా? లేక ఇసుక కాంట్రాక్టు అప్పగిస్తారా? వంటి ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయన్నారు. ఇసుక, మద్యం, బైజూస్, స్మార్ట్ మీటర్లకు టెండర్లు వంటివాటి వెనుక గత నాలుగేళ్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే వార్తలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ జిఒలు గతంలో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండేవని, ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి చెప్పిందన్నారు. ఎప్పుడైనా ఒక జిఒ వెలుగులోకొస్తే అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా సమాధానాలు ఇవ్వట్లేదన్నారు. వీటన్నింటిపై ప్రజలకు సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై స్పష్టమైన ప్రకటన చేయట్లేదన్నారు. ఎప్పుడు భర్తీ చేస్తారనేది చెప్పట్లేదని తెలిపారు. వామపక్ష ఉగ్రవాదం సాకుతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యవాదులపై అక్రమ కేసులు బనాయిస్తోందన్నారు. వామపక్ష తీవ్రవాదంపై ఢిల్లీలో జరిగిన సదస్సులో పాల్గనడం ద్వారా జగన్ ఏమి చెప్పదల్చుకున్నారని ప్రశ్నించారు. సమీక్షల పేరుతో కృష్ణా జలాలపై హక్కులు వదులుకోకూడదన్నారు. దీనిపై తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ద్రోహం తలపెట్టిన బిజెపితో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏ ప్రయోజనం ఆశించి ఎన్‌డిఎలో కొనసాగుతున్నారో ప్రజలకు చెప్పాలని కోరారు. బిజెపి ధృతరాష్ట్ర కౌగిలిలో నలిగిపోవాలనుకుంటుందో? బయటకు వచ్చి స్వతంత్రంగా నిలబడాలనుకుంటుందో టిడిపి తేల్చుకోవాలని హితవు పలికారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బిజెపి భూస్థాపితం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బిజెపి అన్యాయాలపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.హరికిషోర్, జిల్లా కార్యదర్శి టి.అరుణ్, రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి.పవన్ పాల్గొన్నారు.










