ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) :ప్రజల సంపదైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మే హక్కు కేంద్రంలోని మోడీ సర్కారుకు ఎవరిచ్చారని బిహెచ్‌ఇఎల్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్ష, కార్యదర్శులు కె విజయ్ కుమార్, జికెవి ప్రసాద్ ప్రశ్నించారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను విరమించాలని డిమాండ్ చేస్తూ విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే దీక్షలు ఆదివారానికి 918వ రోజుకు చేరాయి. దీక్షల్లో బిహెచ్‌ఇఎల్ ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి నాయకులు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌కు ఉన్న విలువైన వేల ఎకరాల భూములను కార్పొరేట్ సంస్థలకు అమ్మేసే ప్రయత్నాలను విరమించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు.. ప్రజలందరి హక్కు అని, ఆ హక్కును హరించే అధికారం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి లేదని అన్నారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం జరిగిన పోరాటంలో బిజెపిగాని, దాని అనుబంధ సంస్థలుగానీ ఎక్కడా పాల్గనలేదన్నారు. త్యాగాలతో ఏర్పడి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కర్మాగారాన్ని అమ్మాలని చూస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దీక్షల్లో సంఘం నాయకులు నారపురెడ్డి, శివకుమార్, రామారావు, అచ్చంనాయుడు పాల్గొన్నారు.










